పర్ణశాల

June 21, 2009

ముసుగుదొంగ రూపాలు…రెండోసారి!

Filed under: వ్యక్తిగతం — kathimaheshkumar @ 9:27 am


ఈ విషయంపై నేను రాసిన మొదటి టపాలో ఈ మర్యాదస్తుడు దొంగపేరుతో “నీ dalit christian agenda తో Arabian sea లో కలువు” అని శెలవిచ్చారు. ఇందులో వీరి తోడుదొంగలకు కుల,మత వివక్షలు కనిపించకపోయినా కనీసం వీరి విద్వేషం, ఆభిజాత్యం, ఝాఢ్యం కనిపిస్తాయనుకున్నాను. కానీ ఏం చేద్దాం! దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు ఈ భావజాలాన్ని నెత్తికెక్కించుకుని ఊరేగుతున్న జనాలకు “అర్థం” అవుతుందనుకోవడం నా అమాయకత్వం.

“నేను ఎవ్వనితో గొడవకు దిగను, నన్ను కించపరిస్తే తప్ప. అలా కొన్ని సార్లు జరిగింది కూడా. నేను పెద్ద లెక్క చెయ్యను దేన్నైనా. ఇలాంటిది ఇక్కడ జరిగే కాళ్ళు లాగుడు గట్రా ఐ కేర్ ఏ హూట్.” అని ఉదాత్తంగా శెలవిచ్చిన ఈ మహాజ్ఞాని ఎన్ని మారుపేర్లతో తన బ్లాగురాయడమనే “ఫన్”ని సాధించాడో చెప్పక తప్పదు. ఒక్కో వ్యాఖ్యా చదువుతుంటే మీలో చాలా మందికొ కొన్ని హేట్ బ్లాగులు గుర్తుకొస్తే అది నాతప్పు కాదు. ఎందుకంటే వాటన్నింటినీ బహుశా ఈ మహానుభావుడే ఫన్ కోసం రాసుండొచ్చు. లేదా ఈయన చెంచాలు సగర్వంగా contrinute చేసుండొచ్చు.

“కత్తిని ఎక్కడాన్నా నేను తిట్టినట్టు చూపండి.” అని నా బ్లాగులో ఛాలెంజ్ చేసి, ‘పుస్తకం’లో గోపాలరాజు ఈ ఉన్నతుడే అని నేను చెప్పేసరికీ రొమ్ము విరుచుకుని “ఐతే ఏమిటి” అన్న ఈ ఉదాత్తచరితుడికి మంగళహారతి పట్టాల్సిందే. కొందరు ఆల్రెడీ పడుతున్నారు లెండి. నా హారతి కొంచెం ఘాటెక్కువ అందుకని కొంచెం దూరంగానే పట్టాలి. పడతాను. ఎంతైనా భారతీయ సంస్కృతీ, చరిత్ర, సాంప్రదాయాలూ ముఖ్యంగా బ్రాహ్మణ గౌరవాన్ని ఒంటిచేత్తో, పదిపన్నెండు పేర్లతో, ఒక సైన్యాన్ని తయారుచేసి, విద్వేషాన్ని నింపి, గండ్రగొడ్డళ్ళు నింపే గంధర్వలోకాలకు సాగనంపి, కనీసం ద్వేషాన్ని రగిలించి నిలపాలని పరితపించే వ్యక్తికదా!

ఏమైనా అంటే “కుచ్ తో లోగ్ కహేంగే” అని పాటలు పాడతాడుగానీ, తన కుతిని తీర్చుకోవడానికి ఎన్నెన్ని తప్పుడు దారులు తొక్కాడో ఒక్కొక్కటీ తెలుస్తుంటే నాకూ విపరీమైన గౌరవం వచ్చేస్తోంది. అర్జంటుగా గుంటూరు పిలిపించి మర్యాదలు చేశెయ్యాలనే భావావేశం ఉప్పొంగిపోతోంది.

ఈ టపాలో ఈ మహాజ్ఞాని , సిద్ధయోగికున్న మరో నామధేయం అలాగే తనకంటూ పది బ్లాగులున్నా నా బ్లాగు మీద గౌరవంతో దాని URL ఇచ్చే ఔదార్యం గురించి తెలుసుకుందాం. ఇందులో చెప్పడానికి ఏమీ లేదు. ఒకసారి ఆల్రెడీ తెలిసిన IP అడ్రస్సుతో పోల్చుకుంటే తన ఫేవరెట్ పేరు గోపాలరాజు కాకుండా ప్రసాద్ అనే పేరుతో “Crime is a crime who ever committed it. It cannot be washed out. And it cannot be justified in any grounds.” అని శెలవిచ్చారు. ఎంత విశాలమైన ప్రతిపాదనకదా!

ఇక్కడ కిటుకేమిటంటే, ఈయన విశాలత్వం అంతా దళితులకూ, క్రిస్టియన్లకూ మాత్రమే వర్తిస్తుంది. వాళ్ళు మాత్రమే చట్టం దృష్టిలో సమానంగా ఉండాలి. అలా ఉండకపోతే ఈయన గారి ఔదార్యానికి ఖర్చయిపోయేదెట్లా? ఎంత ఉన్నతమైన ఆలోచనకదా! అదే ఈయన గొప్పతనం. అభినందించాల్సిందే. పూజించాల్సిందే. ఈ వ్యాఖ్యలో మీకు “samuel reddy is very dangerous to this country” అనే వాక్యం వింటుంటే కొన్ని ప్రత్యేకమైన బ్లాగుల్లోని రాతలు గుర్తు రాలేదుకదా! వస్తే నాది మాత్రం పూచీ కాదండోయ్!!

ఈ సర్వాంతర్యామి గురించి కేవలం రెండు టపాల్లో చేప్పేస్తే ఎలా….ఐ టీవీ స్టైల్లో… “చెప్పాల్సింది చాలా ఉంది. చూడాల్సిందింకా మిగిలే ఉంది.”

PS: కొందరు బ్లాగు మిత్రులకు ఒక చిన్న మనవి. టెర్రరిజానికిచ్చే కొన్ని నిర్వచనాల్లో ఒకటి “The use of violence for the achievement of political ends is common to state and non-state groups. ” ఇక్కడ హింస భావజాలంలో, వాడేపదాల్లో ఉంది. ఈ టెర్రరిస్టు మూక మమ్మల్నెక్కడ అటాక్ చేస్తుందో అని భయంభయంగా మీమీ బ్లాగుల్లో దాక్కుంటే అదే వారి విజయం. వారి విజయాన్ని కాంక్షించి ఊరకుంటారో, నాతో గొంతుకలిపి వెళ్ళగొడతారో అది మీ ఛాయ్స్. మీ హక్కు. కానీ నా పోరాటం మాత్రం ఆగదు. సైలెంటుగా నాకు మద్ధత్తు తెలుపుతున్న అందరికీ నా కృతజ్ఞతలు.

****

June 20, 2009

ముసుగుదొంగ రూపాలు…ఒకటోసారి!

Filed under: వ్యక్తిగతం — kathimaheshkumar @ 2:59 pm


మర్యాదస్తుల అసలు రూపాలు…
IP అడ్రసులు గమనించుకోండి. గొప్పోళ్ళ గొప్పలు మళ్ళీ చూసుకోండి.
This is just the beginning.

****

విన్నపం : తెలుగు బ్లాగుల్లో కులవివక్ష – సైబర్ నేరాలు

Filed under: వ్యక్తిగతం — kathimaheshkumar @ 5:27 am

పుస్తకం డాట్ నెట్ లో చలంపై జరిగిన ఒక చర్చలో నాపై కులపరమైన నింద చేస్తూ “హయ్దరాబాద్ సెంట్రల్ యూనివర్సిటిలో రిజర్వేషన్ తో పీజీ చేయంగనే ఓ కొమ్ములేం రావు. ఊర్కే రెచ్చిపోమాక” అనే వ్యాఖ్య గోపాలరాజు అనే వ్యక్తి చెయ్యడం జరిగింది. సదరు గోపాలరాజు తనదంటూ, నా బ్లాగు URL కూడా అక్కడ ఉంచడం జరిగింది. అంటే అతని పేరు మీద క్లిక్ చేస్తే డైరెక్టుగా నా బ్లాగుకు లంకె వెళ్ళేలా ఏర్పాటు చెయ్యడం జరిగింది.

ఆ వ్యక్తి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

Author : గోపాలరాజు (IP: 12.107.152.253 , s1.oag.state.ny.us)
E-mail : gopalaraju@gmail.com
URL : http://parnashaala.blogspot.com
Whois : http://ws.arin.net/cgi-bin/whois.pl?queryinput=12.107.152.253

ఈ IP ఆధారంగా నేను కొందరి మిత్రుల సహాయంతో ఈ వ్యక్తిని కనుగొనడం జరిగింది. కొన్నాళ్ళుగా ఇతను వివిధ బ్లాగుల్లో,వివిధ పేర్లతో నాగురించి రాసిన వ్యాఖ్యల్ని కూడా సేకరించే ప్రయత్నం చేస్తున్నాను. అందుకు మితృలు సహృదయంతో స్పందించగలనని ఆశిస్తున్నాను. ఎక్కడెక్కడైతే వ్యాఖ్యాత స్థానంలో నా బ్లాగు URL ఇవ్వబడి misleading, impostoring amounting to cyber-cheating చెయ్యబడిందో అలాంటి అన్ని చోట్లా ఈ వ్యక్తి “నా గుర్తింపు” ని దుర్వినియోగం చేసి చట్టప్రకారం శిక్షార్హుడు అవుతున్నాడని నేను నమ్ముతున్నానుగనక, దయచేసి ఆ వివరాల్ని నాకు ఇవ్వగలరని కోరుతున్నాను.

వర్డ్ ప్రెస్ వాడుతున్న బ్లాగర్లందరూ దయచేసి ఈ IP అడ్రసు నుంచీ నన్ను నిందిస్తూ వచ్చిన వ్యాఖ్యలతో నన్ను సంప్రదించగలని కోరుతున్నాను. బ్లాగర్ వాడుతున్న బ్లాగర్ మిత్రులు సందేహాస్పదమైన వ్యాఖ్యల్ని నాకు URLతో సహా పంపిన ఎడల గూగుల్ వారి హైదరాబాద్ ఆఫీసు ద్వారా ఈ ముసుగు వీరుడిని తన ఇతర స్నేహితులనూ సత్కరించే ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాను. నా మెయిల్ ID mahesh.kathi@gmail.com. నన్ను మెయిల్ ద్వారా సంప్రదిస్తే నా దగ్గరున్న వివరాల్ని పంచుకోగలను.

ఇంత చదువుకున్న వ్యక్తి,అమెరికాలో మంచి ఉద్యోగంలో ఉంటున్న వ్యక్తి, ఉన్నత సాంప్రదాయక కుటుంబం నుంచీ వచ్చానని చెప్పుకొంటున్న వ్యక్తి, భారతీయ సంస్కృతీ-సాంప్రదాయాల్ని-దేశభక్తినీ రగరగాల్లో నింపుకుని కార్యోన్ముఖుడై ఉన్నాని చెప్పుకునే ఒక వ్యక్తి, తెలుగు బ్లాగుల్లో కుల వివక్షనూ, మత విద్వేషాలనూ, సైబర్ నేరాలనూ ప్రోత్సహించి నాయకత్వం వహించడం శోచనీయం. కేవలం ఖండించి పక్కకు తప్పుకునే స్థాయినుంచీ వ్యక్తిత్వహననం చేసి, అమానవీయ నిందా వ్యాఖ్యలు చేసి భారతీయ శిక్షాస్మృతిలో శిక్షార్హమైన నేరాలను తనూ చేస్తూ ఇతరులనూ ప్రోత్సహిస్తున్న స్థాయికి ఎదగడంలో మనందరి పాత్రా ఉంది. మనందరి మౌనప్రోత్సాహం లేకుంటే, మనందరం ఉపేక్షించకుండా ఉండివుంటే పరిస్థితి ఇంత వరకూ వచ్చుండేది కాదు. కనీసం ఇప్పటికైనా బాధ్యత తీసుకుందాం. నా తరఫునుంచీ ముందడుగు వెయ్యడానికి నేను సిద్ధం. మీ సహకారం కోసమే ఈ అభ్యర్థన.

కూడలి, జల్లెడ,పుస్తకం,నవతరంగం నిర్వాహకులకు కూడా ఇదే అభ్యర్థనను చేస్తున్నాను. నాకు చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు అవసరమైన సమాచారాన్ని అందించండి. తెలుగు బ్లాగుల్ని ఈ ఆభిజాత్యాలనుంచీ రక్షించండి. చట్టవ్యతిరేక చర్యలకు పాలుపడుతున్న వ్యక్తులను భారతీయ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం సాక్షిగా శిక్షించే ప్రయత్నంలో సహకరించండి.

****

June 18, 2009

కాంట్రడిక్షన్

Filed under: కవిత — kathimaheshkumar @ 1:05 pm


కారుకూతలు కూసి
కాలాన్ని కాపాడుతారు
మనిషిని చిన్నచూపు చూసి
మానవత్వానికి పట్టంగడతారు

క్రిందనున్న నలుపు
కెలుకుడు బలుపు
మూర్ఖపు ఝడుపు
మేధో(తో) విరుపు
వీళ్ళను వటవృక్షాల్ని చేస్తే
ఆముదాల చెట్టు అలికిడికి
అధాట్టున దాక్కుంటారు

గ్రూపుల్ని తుదముట్టడానికి
తొడగొట్టి
సైన్యమని జట్టుకట్టి
పోరాటనికి… దైన్యంగా…
ముసుగులేసుకుని
ముసురుకుంటారు
ఎదురైనా పడతారా అంటే
ఎదురేలేని వీరికి
ఎక్కడిదో అంతటి అదురూ బెదురూ!

చీకట్లోనే స్వైరవిహారం
ముసుగుల్లోనే సాహస విన్యాసం
గూఢమైన కుతిరాతల్లోనే
రతి ఆస్వాదం

కాంట్రడిక్షన్ ను కాంట్రడిక్ట్ చెయ్యాలంటే
ఆమాత్రం కసరత్తు తప్పదు
ఏ అపోహ కోసం పోరాడుతున్నారో
ఆ అపోహ తామవ్వక తప్పదు

*****

‘కత్తెర’ కథ

Filed under: సినిమాలు — kathimaheshkumar @ 4:37 am

“the great editing skill will protect the director from committing suicide”

– Sean penn, Actor/Director

“కట్” అనే మాట సినిమా ప్రారంభమై రోజుల్లో అస్సలుండేదే కాదు. రైలు ప్రయాణించడమో, ఫ్యాక్టరీ నుంచీ వర్కర్లు బార్లుబార్లుగా బయటికి రావడమో లాంటి నిత్యజీవిత దృశ్యాల్ని ఆ దృశ్యం అయిపోయేవరకో లేక కెమరాలో ఫిల్మ్ అయిపోయేంతవరకో అట్టాగే పెట్టేసి తెరకెక్కించి జనాలకు చూపించేసేవాళ్ళు. ఇందులోని వైవిధ్యం కొంతే. కదులుతున్న నిత్యజీవితంలోని బొమ్మల్నే, వీధుల్లో సందుల్లో కనిపించే దృశ్యాల్నే డబ్బులిచ్చిమరీ తెరమీద ఎన్నాళ్ళని చూస్తారూ! అందుకే సినిమా ఒక పనికిరాని భవిష్యత్తేలేని సాంకేతిక ప్రయోగంగానే మిగిలిపోయే ప్రమాదం ఏర్పడింది. అప్పుడొచ్చాడు కత్తెర తీసుకుని మన ప్రప్రధమ ఎడిటర్ ఎడ్విన్ పోట్టర్.

ఎడ్విన్ పోట్టర్ తన కత్తెరతో “ఇంటర్ కట్” అనే ఒక అద్వితీయ ప్రక్రియకు శ్రీకారం చుట్టాడు. ఒకే సమయంలో జరుగుతున్న రెండు వేరు వేరు పరస్పర సంబంధమైన ఘటనల్ని మార్చిమార్చి చూపించడం ద్వారా ఒక అద్భుతాన్ని సృష్టించాడు. ఒకవైపు మంటల్లో రగులుతున్న భవనం. మరోవైపు గుర్రబ్బళ్ళలో మంటల్ని ఆర్పడానికి వస్తున్న ఫైర్ మెన్. వచ్చారా…రక్షించారా…ఏమయ్యింది అని ఉత్కంఠంతో ప్రేక్షకులు ఊపిరిబిగబట్టి సినిమా చూశారు. 1903 లో సినిమాల్లో ఎడిటర్ జన్మించాడు. దానితోపాటూ ఒక కొత్త భాష, కొంగ్రొత్త కళ ఉద్భవించాయి. ఒక్క కనురెప్ప మూసిన క్షణంలో దిగంతాలనుంచీ అనంతాలవరకూ, మానవ ముఖకవళికలనుంచీ తన బుర్రలోని అధోలోకాలవరకూ తెరమీద ఆవిష్కరించగల కళారూపం సృష్టించబడింది.

ఏడిటింగ్ సమయాన్ని నిదానించగలదు. సమయాన్ని వేగవంతం చెయ్యగలదు. ఒక్క కట్ తో ప్రేక్షకుల్ని కుర్చీల్లోంచి లేచి నుంచోపెట్టగలదు. ఆశ్చర్యపరచగలదు. భయపెట్టగలదు. షాట్ నిడివి, సీన్ నడవడికను నిర్ణయించి కథన రీతిని నిర్దేశింగలదు. ప్రేక్షకులభావేశాన్ని నియంత్రించగలదు. బహుశా తన జీవితాన్ని నిర్దేశించాలనుకునే మనిషిలోని అంతర్లీన కోరికకు ఎడిటింగ్ ప్రతీకలాగా అనిపిస్తుంది. ప్రతి మనిషీ తన జీవితంలోని బోరుకొట్టే చెడ్డభాగాలను కత్తిరించి పారెయ్యాలనుకుంటాడు. ఆసక్తికరమైన భాగాలను నిదానంగా,లోతుగా తరచి చూసి ఆనందించాలనుకుంటాడు. ఆవేశాన్నీ కోపాన్నీ ఉద్వేగాన్నీ వేగంగా ముగించెయ్యాలనుకుంటాడు. అదే సౌలభ్యం ఎడిటింగ్ లో ఉంది. బహుశా ఎడిటింగ్ వలనే మనిషికి సినిమా నచ్చుతుంది. ఎడిటింగ్ లేకపోతే సాధారణ జీవితంలాంటి సినిమా బోర్ కొట్టదూ!

పూర్తి వ్యాసం కోసం నవతరంగం చూడండి.

P.S. భారతీయ ఎడిటర్ల గురించి రాయడానికి ప్రయత్నించాను. కనీసం మొదటి మూకీ `రాజాహరిశ్చద్రం’(1913) ఎడిటర్ ఎవరో మొదటి టాకీ ‘అలం అరా’(1931) ను కత్తిరించిందెవరో చెబుదామని వెతికాను.దురదృష్టవశాత్తూ ఆ వివరాలు నాకు లభించలేదు. బహుశా అశిష్ రాజ్యాధ్యక్షా పుస్తకంలో ఉన్నాయేమో చూడాలి.

ఒకటి మాత్రం చూచాయగా చెప్పొచ్చు. ఎడిటర్లకు ఇప్పటికీ మనం ఇచ్చే గుర్తింపు తక్కువే. అప్పట్లో ఎంతిచ్చామన్నది వాళ్ళపేర్లు లభ్యమవకపోవడం సూచిస్తోంది. భారతీయ సినిమా ఎడిటింగ్ పరంగా అందించిన నూతన విధానం ఏమైనా ఉందా అనేది ఒక పెద్ద ప్రశ్నే!

****

June 17, 2009

లిటరరీ & ఫిల్మ్ క్లబ్స్ ఎక్కడా?

Filed under: సాహిత్యం, సినిమాలు — kathimaheshkumar @ 10:44 am

రచయిత ఉద్దేశించినట్లే అందరు పాఠకులూ అర్థం చేసుకోవాలని కోరుకోవడం బహుశా మితిమీరిన ఆశావాహక దృక్పధం అనిపించుకుంటుంది. సినిమా విషయంలోనూ అంతే. దర్శకులూ,నిర్మాతలు ఎవరూ ఫ్లాపు సినిమా తియ్యాలని తియ్యరు. అలా అయిపోతాయంతే. ఒక రచన చేసేప్పుడు అది “ముఖ్యమైనది” అనుకునే రచయితలు రాస్తారు. కానీ పాఠకుడు “చెత్త” అనుకుంటే మనం చెయ్యగలిగెదేమీ లేదు. దీనికి విపరీతంగా కూడా జరిగే అవకాశం ఉంది. ఏదో ‘అలాఅలా’ రాసేస్తే అదొక ఉద్యమాన్ని సృష్టించెయ్యొచ్చు. సినిమా మామూలుగా తీస్తే కళాఖండంగా మిగిలిపొనూవచ్చు.

రాసిన వెంఠనే రచన రచయితను మీరి స్వతంత్ర్య ప్రతిపత్తిని సంతరించుకుంటుంది. ఒకసారి పాఠకుడి చేతుల్లోకి వెళ్ళిన తరువాత తన మనఃస్థితిని బట్టి, పూర్వజ్ఞానాన్ని బట్టి కొత్త అర్థాల్ని సంతరించుకుంటుంది. దీన్నే reader centric interpretation అంటారు. సినిమాను తెరపై చూస్తున్న ప్రతి ప్రేక్షకుడూ ఒకే స్పందన చెందుతాడనేది ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేని విషయం. ఇక్కడా ప్రేక్షకుడి “స్వీయానువాదానికి” బలమైన స్థానముంది. ఆ స్పందనలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే…ఒకసారి నవతరంగంలో ఒకే సినిమాపై వచ్చే రెండు విపరీతమైన సమీక్షలు చదివితే అర్థమవుతాయి. టీవీల్లో తమ సినిమాని ఊదరగొట్టే దర్శకులు చెప్పినదానికీ ఈ రెండు,మూడు,నాలుగు సమీక్షలకీ అస్సలు పొంతనుండదు. మరొ వందమంది అదే సినిమా గురించి చెప్పినా అవి ఎంతోకొంత స్థాయిలో విభిన్నంగానే ఉంటాయి.

ప్రతి పాఠక/ప్రేక్షకుడి “స్థాయీ” రచయిత/దర్శకుడి స్థాయి కాబఖ్ఖరలేదు. రచయిత/దర్శకుడు ఆశించిన స్థాయిలోనే పాఠక/ప్రేక్షకుడు రసస్పందన చెందనవసరమూ లేదు. అయితే, పాఠక/ప్రేక్షకుల స్వీయానువాదానికి ఎంత విలువున్నా ఒక text ని intended form లో చదవడానికి కొంత “EDUCATION”(what ever it means) అవసరం అనేది చాలా మంది అంగీకరించే విషయం. సినిమా విషయంలో కూడా ఈ వాదన చాలా బలంగా వినిపిస్తుంది. అందుకే లిటరరీ క్లబ్స్, ఫిల్మ్ క్లబ్స్ ఒక సాంస్కృతిక ఒకప్పుడు ఉద్యమంలాగా బయల్దేరాయి. ఈ క్లబ్స్ ఉద్దేశం రచనలు/సినిమాల మూల ఉద్దేశాల్ని అవగతం చెయ్యడం. అంతేకాక వాటికున్న సామాజిక సైద్ధాంతిక నేపధ్యాల్ని పరిచయం చేస్తూ పాఠక/ప్రేక్షకుల్లో ఒక మానసిక వేదికని ఏర్పరిచి అభిరుచుల్ని పెంపొందించుకునేలా చేసేవి. కానీ ఇప్పుడు అవి బలహీనమయ్యాయో లేక అనవసరం అయ్యాయో తెలీటం లేదు. బ్లాగుల్లో జరుగుతున్న సాహితీచర్చల నేపధ్యంలో వాటి అవసరం మాత్రం ఉంది అనిపిస్తోంది.

****

June 16, 2009

కవిత్వమొక శుద్ధ దండగ !

Filed under: కవిత, సాహిత్యం — kathimaheshkumar @ 7:05 am

కవిత్వమొక శుద్ధ దండగన్నారో పెద్దమనిషి. కవిత్వం సాహిత్యాన్ని చంపేస్తోందన్నారు మరో సాహితీప్రేమికుడు. నిజమే కాబోలు. కవిత్వం వల్ల, మరీ ముఖ్యంగా భావకవిత్వం వల్ల నిర్ధిష్టమైన “సామాజిక ప్రయోజనం” లేకపోవడం చేత, చాలా మంది ఛెస్టు మీది స్టీము వదిలించుకోవడానికి భావకవిత్వమనే దగ్గర దారిని ఎంచుకోవడం మూలంగా పుంఖాలు పుంఖాలుగా కవిత్వం వెల్లివిరిసిపోతోంది. అంతేకాక భావకవిత్వంలోని విస్తృతిని విస్మరించి దాన్నొక ప్రేమకవిత్వంలోకి కుదించేసి “రైఠో!” అనేస్తున్నారు. బుక్ షాపుల్లో, వెబ్ పేజిల్లో, బ్లాగుల్లో, పత్రికల్లో కవితలే కవితలు. అంతులేని కవితలు. అంతమవని కవితలు. అడ్డూఅదుపూ లేని కవితలు. అదరగొట్టే కవితలు. బెదరగొట్టే కవితలు. అరగదీసే కవితలు. ఇరగదీసే కవితలు. అప్పుడప్పుడూ అరుదైన కవితలు.

ప్రేయసి జ్ఞాపపికలు, విరహాగ్ని కీలకలూ, ప్రేమైక గీతికలూ అలవోకగా ప్రతొక్కరూ పదాల తోరణాలు కట్టి కవిత్వం పేరుతో అక్షరాల్లోకి కుదించెయ్యగలరు. ఇందులో చర్చించడానికీ, విభేధించడానికీ,మేధోమధనం చెయ్యడానికీ ఏమీ ఉండదు. చదివి బాగుందనుకోవడానికో లేక నాకూ ఇలాంటిదొక అనుభవం ఉందనుకోవడానికో లేక నేనూ ఒకటి రాసెయ్యగలను అని ధీమా తెచ్చుకోవడానికోతప్ప కవిత్వంలో ప్రయోజనం, ప్రయోజకత్వం అంతగా కనిపించదు. కాకపోతే ఈ “ధీమా” మాత్రం ప్రతొక్కరినీ కవిని చేసెయ్యగలదు. అదే ఒక గొప్ప ప్రయోజనమంటే మాత్రం చచ్చినట్లు అంగీకరించాల్సిందే. ఎంతైనా భాషా యొక్క వ్యాప్తికి ఈ కవితా ధోరణి దోహదం చేసినట్లే కదా!

“కవిత్వాన్ని నిర్వచించరా!” ఒక ఇంగ్లీషొడ్ని అడిగితే….”The poem is a physical artifact consisting of marks on paper, or the grooves on a Babylonian tablet.
The poem is the sequence of sounds uttered by a speaker, reading aloud.
The poem is the experience of the reader.
The poem is an expression of the experience of the author.
The poem is a stratified complex of values, which cannot be reduced to any of the previous four theories. అన్నాడట. “చచ్చింది గొర్రె” అన్నట్లు. ఇదే సమస్య మనకూ ఉంది. కవిత ఒక వాక్యంలో ఉండాలా, హైకుల్లా మరుగుజ్జైపోవాలా, లేక చాంతాడంత కావ్యాలైపోవాలా అనేది ఎవరూ నిర్ణయించి చచ్చే విషయం కాదు. కాబట్టి రాసిందే కవిత. అందుకే మనకీ ఖర్మతప్పదు.

దండగన్న పెద్ద మనిషి బాధ ‘కవితల్లో ఊహావర్ణనలేతప్ప నిజానికి స్థానం ఉండటం లేదని’. నిజమే! నిజానికి స్థానం ఇవ్వాలంటే నేలవిడిచి సాము చెయ్యడం మానాలి. కానీ కవితాలోకంలో విహరించడం తప్ప జీవించడం ఉండదే! అప్పుడేలా? భావకవిత్వాన్ని పక్కనబెట్టి విషయకవిత్వమూ, అభిప్రాయ కవిత్వమూ, యిజాలకవిత్వమూ మొదలెట్టేస్తే ఆ నిజాలకు స్థానం దక్కి ప్రయోజనం సిద్ధించేస్తుందా అనేది జవాబులేని ప్రశ్న.

కవిత్వం వలన సాహిత్యానికి హాని జరుగుతోందన్న సాహితీప్రేమికుడు వ్యధ చాలా అర్థవంతంగా ఉంది. బండ్లకొద్దీ వస్తున్న కవిత్వం రీములకొద్దీ పేపర్ ను ఖర్చుపెట్టించి అలవికాని ప్రదేశాన్నంతా ఆక్రమించేసి మిగతా సాహిత్యానికి ‘నిలువనీడ’ లేకుండా చెస్తోంది అనేది ఈ వాదన. తప్పదు అంగీకరించాల్సిందే. మరీ ముఖ్యంగా “ఇదే సాహిత్యం” అనుకొని ఒకసారి కవిత్వాన్ని ముట్టుకుని భయపడిపోయిన కుర్రకుంకల్ని చాలా మందిని నేనెరుగుదును. “ఐతే పద్యాలంటారు. లేకపొతే కవిత్వాలంటారు. ఎందుకు మాకీ తంటా” అని ప్రశ్నించిన మా బంధువులబ్బాయి నాకళ్ళముందింకా మెదులుతూనే ఉన్నాడు. “ఈ సాహిత్యానికొక దండం స్వామీ! ఇంతకన్నా యండమూరి నవలలు, పర్సనాలిటీ డెవలెప్మెంట్ పుస్తకాలు బెస్టు” అన్న విద్యార్ధుల్నీ ఎరుగుదును. “యండమూరిదీ సాహిత్యమేరా భడవా” అంటే “అలా అంటే మీరొప్పుకోరుగా” అని చురక అంటించాడు మరొకడు.

కనీసం కథాసాహిత్యం, నవలా సాహిత్యం ప్రొఫెషనల్ రచయితల పుణ్యమా అని జనాల్లో మిగిలుంటే దానిక్కూడా గండిగొట్టేపని కవితాసాహిత్యం చేస్తోంది అనేది మరొక వాదన. క్లాసుల్లో పద్యాల హోరుతో భయపడి పుస్తకప్రపంచంలో కవితల్తో హడలెక్కి తెలుగు పుస్తకం ముట్టుకుంటే ఝడిసిపోయే ఘటాల్ని మనం తయారుచేస్తున్నామేమో ఈ కవితా ప్రవాహం వల్ల అనేది ఒక అనుమానం.

వ్యక్తిగతంగా నేను బ్లాగుల్లోకొచ్చేంతవరకూ కవితల్ని చదివిన పాపాన పోలేదు. ఏదో శ్రీశ్రీ ఆవేశాలూ, కృష్ణశాస్త్రి భావాలూ గాల్లో ఎగురుతూ అప్పుడప్పుడూ తాకినవేగాని ప్రత్యేకించి అందులో నేను చేసిన సాధన అస్సలు లేదు. చదవంగా చదవంగా కొంత ఆనందాన్ని మరింత ఆశ్చర్యాన్నీ కొన్ని కవితలు ఖచ్చితంగా ఇచ్చాయని చెప్పొచ్చు. “మరి ఆనందానికీ, ఆశ్చర్యానికీ సామాజిక ప్రయోజనం ఉందా?” అంటే మాత్రం నేను నోరుమూసుకోక తప్పదు. అలౌకిక అనుభూతుల గురించి నాకు తెలీదుగానీ మనుషుల్లోని కాంప్లెక్సిటీని అప్పుడప్పుడూ భాష అభివ్యక్తీకరించలేకపోతే వాటిని కవితల రూపంలో ప్రయత్నించొచ్చేమో అనే ఆశమాత్రం కలుగుతుంది నాకు.

స్వర్ణకమలం సినిమాలో భానుప్రియ పరవశించి నృత్యం చేసిన తరువాత కళ్ళలో నీళ్ళు నింపుకుని ‘కళలో ఇంత ఆనందం ఉంటుందని ఇప్పటి వరకూ నాకు తెలీదు” అంటుంది. అప్పటిదాకా భౌతిక ‘ఆశ’ల కోసం కళను చిన్నచూపు చూసిన ఆ పాత్ర “రసస్పందన” పొందడంలో పారలౌకిక ఆనందాన్ని అనుభవిస్తుంది. అది పేట్రనైజింగ్ గా అనిపించినా అప్పుడప్పుడూ సాహిత్యానికున్న పరమావధి కూడా అదేకదా అనిపించక మానదు. తిండీగుడ్డా సమస్యలుగా ఉన్న మనుషులకు సాహిత్యంతోగానీ మరే ఇతర కళలతోగానీ ముఖ్యంగా కవిత్వంతో అస్సలు అవసరం లేదు. బౌతికావసరాలు మీరి మానసిక అవసరాలలోకూడా ఒక స్థాయిని దాటిన మనుషులకు మాత్రమే ఇవి కావాలి.

కాబట్టి ప్రయోజనమే కొంత మందికున్న సాహిత్యాన్ని గురించి కవిత్వాన్ని గురించీ పేజీలు పేజీలి బాధపడటమే అనవసరం అనిపిస్తోంది. ఏమిటో ఈ పిచ్చి.

*****

June 15, 2009

వేసవి రుచి

Filed under: కథ — kathimaheshkumar @ 8:03 am

కాంపౌండ్ గోడ మీది వేడిగాలి ఎండమావిని తలపిస్తోంది. ఎండాకాలం మొదలైపోయింది.

ఈ వేసవి మధ్యాహ్నపు ఇబ్బందికరమైన నిశ్శబ్ధం. నిశ్శబ్దాన్నిభంగం చేస్తూ వేలితో కిటీకీ ఊచమీద నోటి వెంటొచ్చిన సన్నటి పాటకు అనుగుణంగా లయబద్దంగా ఒక చిన్న దరువు వేసాను. “తుమ్ ఆగయేహో నూర్ ఆగయాహై”అనే కిశోర్ కుమార్ పాత హిందీ పాట. నీకూ నాకూ అమితంగా నచ్చిన పాట.

కొన్నేళ్ళ క్రితం నీ కోసం ఈ పాట పాడినప్పుడు, ఇప్పుడున్న ఇనుపచువ్వల స్థానంలో నీ కాలి మువ్వలున్నాయి. ఆ మద్యాహ్నంలో కూడా ఇలాంటి నిశ్శబ్దమే. ముదురాకుపచ్చ చీర, మ్యాచింగ్ బ్లౌజుతో నువ్వు. చేతిని ఆసరా అడిగిన చుబుకం, మధురమైన నిద్రకొరిగినట్లుగా తల కొద్దిగా పక్కనపెట్టి, కళ్ళు మూసుకుని నా ఒడిలో నువ్వు. నీకు గుర్తుందా? ఆ మధ్యాహ్నం, నా గదిలో మనం. సీలింగ్ ఫ్యాన్ గాలికి నీ కురులు బుగ్గల్ని తడుముతుంటే, ఏదో నల్లమబ్బుల మాటునున్న నిజాన్ని తట్టిలేపుతున్న అనుభూతి. ఇంకా ఏదేదో!

పాటకు పరవశిస్తున్న నువ్వు, నా చెయ్యి నీ బ్లౌజు మీదున్న చెమట తడిని ముట్టుకున్నా కళ్ళు తెరవలేదు. నీ మెడనుంచీ చెమట మెల్లగా కుడి వక్షం వొంపు క్రిందకు నిదానంగా జారుతుంటే నేనందుకున్నాను. నువ్వుమాత్రం కళ్ళు మూసుకుని మెత్తగా నవ్వుకున్నావు. ఆ నీ చెమట బిందువు నా వేలికొసపై చిన్నగా, వెలుతురు సరిగా లేని గదిలో వెచ్చగా మెరిసింది. ఆ తడి వేలిని నా పెదాలు తాకాయి. ఆ క్షణంలో ఈ వేసవి రుచి నాకు అవగతమయ్యింది.

ఆ తరువాత…నా నుదుర్ని నీ ఒడి కాల్చినప్పుడుగానీ నేను కళ్ళు మూయలేదు. నా చేతులు నీ పాదాలు తాకిన తరువాత గానీ నువ్వు కళ్ళు తెరవలేదు.

ఆ కలయికే ఒక జీవితకాలం. ఆ అనుభవమే నా శాశ్వత ధ్యానం.

ఇప్పుడు నువ్వు లేవు. నేనున్నా నేను లేను. జ్ఞాపకం మాత్రం మిగిలే ఉంది. చీకటి గదిలో ఆ చెమటచుక్క ఇంకా మెరుస్తూనే ఉంది. వేసవి మధ్యాహ్నపు రుచి గుర్తొస్తూనే ఉంది.

*****

June 13, 2009

సంగమం

Filed under: కవిత — kathimaheshkumar @ 1:37 am


నాకూ ఆమెకూ మధ్య జరిగే
ఈ అంతిమ ప్రయాణానికి ముందు
ఎన్ని రూపులు వశించిందో
ఎన్ని చేతులు సృజించాయో
ఎందరు పురుషులు స్పృశించారో

అగమ్యమైన గమనంతో
తను నన్ను చేరినప్పుడు
నిశ్చలంగా పరికించాను
ఈ అనంతంలోని
ఘటనను పూరించడానికి
నన్ను తనలో కలుపుకున్నప్పుడు
అబ్బురపడి పులకించాను

ఆద్యంతాల్ని సృష్టించిన
ఆ ఆదివిస్ఫోటం మొదలు
నేనూ…ఆమె…ఆమె…నేను
ఈ ఉదంతం కోసమే కదా ఎదురుచూసింది!

****

సంగమం

Filed under: కవిత — kathimaheshkumar @ 1:37 am


నాకూ ఆమెకూ మధ్య జరిగే
ఈ అంతిమ ప్రయాణానికి ముందు
ఎన్ని రూపులు వశించిందో
ఎన్ని చేతులు సృజించాయో
ఎందరు పురుషులు స్పృశించారో

అగమ్యమైన గమనంతో
తను నన్ను చేరినప్పుడు
నిశ్చలంగా పరికించాను
ఈ అనంతంలోని
ఘటనను పూరించడానికి
నన్ను తనలో కలుపుకున్నప్పుడు
అబ్బురపడి పులకించాను

ఆద్యంతాల్ని సృష్టించిన
ఆ ఆదివిస్ఫోటం మొదలు
నేనూ…ఆమె…ఆమె…నేను
ఈ ఉదంతం కోసమే కదా ఎదురుచూసింది!

****
Older Posts »

Theme: Banana Smoothie. Blog at WordPress.com.

Follow

Get every new post delivered to your Inbox.