పర్ణశాల

June 5, 2009

మీరు దేవుడ్ని నమ్ముతారా?

Filed under: మతం, సినిమాలు — kathimaheshkumar @ 7:57 am


ఇప్పుడే ‘డావిన్సీ కోడ్’ రచయిత డాన్ బ్రౌన్ రాసిన మరో నవల ‘ఏంజిల్స్ అన్డ్ డెమొన్స్’ సినిమా రూపకం చూసొస్తున్నాను. గొప్ప సినిమా కాదుగానీ నిర్మాణ విలువలు, నటన, లొకేషన్ల పరంగా విజువల్ ట్రీట్ అనుకోవచ్చు. కథాంశం ఎలాగూ ధిల్లర్ కాబట్టి వేగం, మలుపులతో ఆసక్తికరంగా సాగే ఒక కమర్షియల్ సినిమాగా బాగానే ఉంది. ఖచ్చితంగా ఒకసారి చూసెయ్యొచ్చు. మతానికి సంబంధించిన కుట్రలూ, క్రైస్తవ మతం సాగించిన హత్యలూ, సైన్సు తో క్రైస్తవం యొక్క చారిత్రాత్మక విభేధాలూ వంటి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ సినిమాలో ఆద్యంతం మనల్ని ఆకట్టుకుంటాయి. వాటికన్ సిటీ అందాలు. బృహత్తరమైన, మహత్తరమైన కట్టడాలు వాటి చరిత్రా చూపించిన విధానం దృశ్యపరంగానూ డావిన్సీ కోడ్ సినిమా కంటే మెరుగ్గా అనిపిస్తాయి.

ఈ టపా ఈ సినిమాను సమీక్షించడానికి కాదు. కాకపోతే నేను చెప్పబోయే విషయానికి భూమికగా పై సోది చెప్పాల్సి వచ్చింది. ఈ సినిమాలో ముఖ్యపాత్రధారి డాక్టర్ ప్రొఫెసర్ రాబర్ట్ లాంగ్డన్ సింబాలజిస్ట్, ఒక హేతువాది. అప్పటికే చర్చ్ కి వ్యతిరేకంగా పుస్తకాలు రాసిన వ్యక్తి. అటువంటి రాబర్ట్ ను ఒక పాత్ర “నువ్వు దేవుడ్ని నమ్ముతావా?” అని ప్రశ్నిస్తుంది. సహజంగా అయితే “నమ్మను” అనే సాధారణమైన సమాధానం సరిపోతుంది. కానీ అక్కడ జరిగే సంవాదం మతం పట్ల ఒక ఆసక్తికరమైన చర్చగా మారుతుంది. ఆ సంబాషణల్ని తెలుగు అనువాదంతో సహా ఇక్కడ పెడుతున్నాను.

Do you believe in God Mr. Langdon?
మీరు దేవుడ్ని నమ్ముతారా మిస్టర్ లాంగ్డన్?
I want to believe.
నమ్మాలని అనుకుంటాను.
Mr. Langdon, I did not ask if you believe what man says about God. I asked if you believed in God.
మిస్టర్ లాంగ్డన్ నేనడిగింది మీరు దేవుడి గురించి మనుషులు చెబుతున్నవి నమ్ముతారా అని కాదు. దేవుడ్ని నమ్ముతారా అని.
My mind tells me I will never understand God. And my heart tells me I am not meant to.”
నా మెదడు చెబుతోంది నేను దేవుడ్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేనని. నా మనసు నేను దేవుడ్ని అర్థం చేసుకోవడానికి ఉద్దేశింపబడలేదంటోంది.

ఇదొక ఉదాహరణ మాత్రమే. ఈ సినిమాలో ఇలాంటివి మరికొన్ని ఉన్నాయి. వాటి గురించి మరోసారి.

****

May 14, 2009

చరిత్రా, పురాణమా!

Filed under: మతం — kathimaheshkumar @ 4:28 pm

“ఒక జాతి ముందుకు పోవటానికి తోడ్పడేది చరిత్రా,పురాణమా? ఈ ప్రశ్నకు పురాణమే అని సమాధానమిచ్చే స్థితిలో ఉన్నవాడు బహుశా భారతీయుడే అయి ఉంటాడు. వాస్తవ చరిత్ర లిఖిత రూపాలలో నిక్షేపించడం ఇతర ప్రాచ్య దేశాలవారికి తెలిసినట్టు భారతీయులకు తెలీదు. అందుచేత ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. మన తొలి సంస్కృతిని పాశ్చాత్యులు మన వైదిక సంస్కృతిలో చూస్తే, మన సంస్కృతిని మధ్య ఆసియావాసులు గణితంలోనూ, ఖగోళ శాస్త్రంలోనూ, వైద్యశాస్త్రంలోనూ చూస్తే, మనం మటుకు దాన్ని రామాయణంలో చూస్తున్నాము. ప్రపంచానికి చూపించటానికి గర్వపడుతున్నాం.

మనజీవితానికి ఉపకరించే సత్యాలన్నీ రామాయణంలో ఉన్నట్టు ఆధునిక పౌరాణికులు ప్రచారం చేస్తున్నారు. చరిత్రనుంచీ ఫలాని విషయాలు నేర్చుకోవాలని గట్టిగా ప్రచారం చేసేవాళ్ళు లేరు. మన భవిష్యత్తంతా రామాయణం మీద ఆధారపడి ఉండగా మళ్ళీ చరిత్ర దేనికి?

ఇంతకన్నా చిత్రం ఏమిటంటే మనం ఆపురాణాలను ఉన్నవి ఉన్నట్టుగా ఉండనీయటం లేదు.మన సంస్కృతికి పరాకాష్ట అయిన రామాయణం కథా, శంబూక వధా అన్నీ రామాయణ ప్రక్షిప్తాలలో ఉన్నవే.ప్రక్షిప్తాలుకాని రామాయణ భాగాలనుకూడా మన పౌరాణికులు, ఔత్సాహికులూ మార్చారు. ఈ విధంగా రాముడికి మిత్రుడిగా చెప్పబడ్డ గుహుడు రాముడికి భక్తుడయ్యాడు. శబరి ఇంకో భక్తురాలయ్యింది. అక్కడక్కడా సామాన్యమానవుడి దౌర్బల్యాలు బాహాటంగా ప్రదర్శించే రాముడు ఉన్నట్లుండి దేవుడయి పోతాడు!

పురాణ సంస్కృతి మన సంస్కృతికి పునాది అయినా రాజకీయ కారణాలవల్ల మనకు కొంతవరకూ చరిత్రను గురించి కూడా తోడవటం అవసరనవుతుంది. కాని అందువల్ల కలిగే ఇబ్బందిని దాటడానికి మన పురాణాలకు చేసిన మర్యాదే చరిత్రకు కూడా చేస్తుంటాం. దాన్ని మన పురాణసంస్కృతికి అనుకూలంగా కూర్చుతూ ఉంటాం. అప్పుడు పురాణాలకూ, చరిత్రకూ గల అట్టే తేడా ఉండనవసరం లేదు.”

- కొడవటిగంటి కుటుంబరావు
యువ మాసపత్రిక, ఆగష్టు -1980

కళలు -శాస్త్రీయ విజ్ఞానం, విరసం ప్రచురణ, సెప్టెంబరు, 1980

పుస్తకం:
కొడవటిగంటి కుటుంబరావు – చరిత్రవ్యాసాలు
ప్రచురణ: విప్లవరచయితల సంఘం
ప్రతులకు: ననోదయ బుక్ హౌస్
వెల: రూ 100 /-



****

May 7, 2009

సీత రాముడికి ఏమవుతుంది?

Filed under: మతం — kathimaheshkumar @ 5:13 am


శీర్షికలోని ప్రశ్నచూసి చొప్పదంటు ప్రశ్నో లేక పిచ్చి ప్రశ్నో అనుకునేరు. చాలా సీరియస్ ప్రశ్న. కొత్తవాదన అనుకోకండి. తెలియని వారికి ఇది కొత్తగా అనిపించినా, తులసీరామాయణం, కంబరామాయణం,కుమారవాల్మీకి రామాయణం, ఆధ్యాత్మరామాయణాలకన్నా ముందున్న బౌద్ధరామాయణం తెలిసినోళ్ళకు ఇది కొత్త ప్రతిపాదనా కాదు. కొత్తవాదన అంతకన్నా కాదు. ఈ రామాయణం ప్రకారం సీత రాముడికి సోదరి అవుతుంది. వయసులో చిన్నది కాబట్టి చెల్లెలన్నమాట.

షాకింగ్ గా ఉందా! అంత ఆశ్చర్యపోనఖ్ఖరలేదు. కథ ఎంతైనా కథే కదా.

ఈ బౌద్ధజాతక కథ ప్రకారం, దశరధుడు అయోధ్యకు కాదు, వారణాశికి రాజు. అంటే కాశీరాజన్నమాట. అతనికి రామపండితుడు, లక్ష్మణకుమారుడు, సీత అనే పిల్లలు. కొంతకాలానికి ఆ పిల్లల తల్లి చనిపోతే మరొక భార్యను పెళ్ళిచేసుకున్నాడు దశరధుడు. ఆ రెండో భార్యకు పుట్టిన కొడుకు భరతుడు.కొత్తకొడుకు ఆనందంలో పెళ్ళాన్ని వరం కోరుకోమంటే, “నా కొడుక్కి ఏడేళ్ళు నిండేసరికీ రాజ్యాభిషేకం చెయ్యి” అని వరం కోరిందట ఆ పిచ్చితల్లి. దశరధుడు మండిపడితే భరతకుమారుడితల్లి అలిగి పడుకుంది. ఆ తర్వాత పీడించడం మొదలెట్టింది.

భార్య పీడనతోపాటూ, ఆ ఉన్మాదంలో మారుపెళ్ళాం తన పిల్లల్ని ఎక్కడ చంపించేస్తుందో అన్న భయంకూడా దశరధుడ్ని పట్టుకు పీడించింది. అందుకే,తెలివిగా ఒక ఆలోచన చేశాడు.తాను మరణిస్తే పెద్ద కుమారుడ్నే రాజుగా చెయ్యాలని నియమం కాబట్టి, అంతవరకూ పిల్లల్ని చావకుండా కాపాడాలంటే వారిని అడవులకు పంపడం సరైన మార్గమని తలచాడు. జ్యోతిష్కులతో సంప్రదించి తన ఆయుర్ధాయం ఇంకా పన్నెండేళ్ళుందని తెలుసుకుని, ఆ పన్నెండేళ్ళూ అడవుల్లోనో లేక ఏ సామంత దేశంలోనూ ఉండమని చెప్పి పంపేసాడు.

పిల్లలు దూరమైన శోకంతో దశరధుడు జ్యోతుష్కులు చెప్పిన సమయంకన్నా ముందే, తిమ్మిదేళ్ళకే మరణించాడు. అదే అదనుగా భరతకుమారుడి తల్లి భరతుడికి పట్టంగట్టాలనుకుంది. కానీ పండితులు అసలు రాజు అడవిలో ఉండగా ససేమిరా అన్నారు. వేరేదారిలేక భరతుడు రాముడ్ని వెతుక్కునివెళ్ళి పట్టాభిషేకానికి ఆహ్వానించాడు. కానీ తండ్రి మాట జవదాటని రాముడు, సీతా లక్ష్మణుల్ని తీసుకెళ్ళమని చెప్పి తన వనవాసం పూర్తయ్యాకనే వస్తానని చెబుతాడు. రాజ్యపరిపాలన ఎరుగని భరతుడి తాను ఎలా రాజ్యమేలతానని ప్రశ్నిస్తే, రాముడు తన పాదుకల్ని ఇస్తాడు. ఆ పాదుకల మహత్యం ఏమిటంటే, రాజ్యపాలనలో అన్యాయం జరిగితే ఒకదానితో ఒకటి జగడమాడటం మొదలెడతాయి. న్యాయం జరిగితేగానీ శాంతించవు. ఈ విధంగా భరతుడు రాజ్యపాలన చేశాడు.

వనవాసం పూర్తయిన మీదట, రాముడు రాజ్యానికి వచ్చాడు. భరతకుమారుడు మంత్రులతోసహా వెళ్ళి, రాముడ్ని రాజుగానూ, సీతను రాణినిగా చేసి రాజ్యాన్ని అప్పగించాడు.

ఈ రామాయణంలో రావణుడులేడు. హనుమంతుడు లేడు.యుద్ధం లేదు. రామాయణం ప్రబోధించే “విలువలు” లేవు. ఇక అన్నాచెళ్ళెల్ల వివాహం అంటారా, అప్పటి రాచరికంలో incestuous పెళ్ళిళ్ళు ఉండే అవకాశం పెద్ద ఆశ్చర్యకరం ఏమాత్రం కాదు. అమలి రాచరికపు రక్తం పేరుతో ఇలాంటి సాంప్రదాయాలు చరిత్రలోని చాలా రాచరికాల్లో ఉండటం మనకు తెలిసిందే.

ఈ కథను కొందరు రామాయణాన్ని కించపరచడానికి బౌద్ధులు పన్నిన కుట్రగా అభివర్ణిస్తారు. కానీ ఈ కథకు కొనసాగింపుగా సాగే వ్యాఖ్యానంలో బుద్ధుడు శుద్ధోధన రాజే దశరధుడని, లక్ష్మణకుమారుడు సారిపుత్రుడని, భరతకుమారుడు ఆనందుడనీ, సీతాదేవి యశోధర అని, తానే రామపండితుడ్ననీ చెబుతాడు. అలాంటప్పుడు ఇది రామాయణాన్ని అపహాస్యం చేసే ప్రయత్నమని ఎలా అనుకోవాలన్నది సందేహాస్పదం.

ఏదిఏమైనా ఇదొక ఆసక్తికరమైన కథ. ఇలాంటి కథే మరొకటి ఈ లంకెద్వారా చదవండి.

*****

April 24, 2009

మతానికి నా నిర్వచనం

Filed under: మతం — kathimaheshkumar @ 5:07 am

మతం అనేది ప్రతి సమాజం తన ఉనికిని కాపాడుకోవడానికి ఏర్పరిచే కట్టుబాట్ల చిట్టా (Rule book).అది సమయానుగుణంగా మారుతుంది. ఏ మతమైనా “Thou shall not do this,do that” అని ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో చెబుతుంది.అందుకే అదొక rule book అన్నాను. మీకు మరీ తేలిగ్గా అనిపిస్తే అదొక “మతపరమైన రాజ్యాంగం” అనికోవచ్చు. అది నా నిర్వచనం.

దేవుడెక్కడున్నాడో చెబితే,ఆ అతరువాత చేరుకునే మార్గం దానంతట అదే దొరుకుతుంది. ఒకవేళ అదే మతం యొక్క నిర్వచనమైతే, ప్రస్తుతానికి నాకు దాని అవసరం లేదు.భగవంతుదితో నాకు ప్రత్యేకమైన పనేమీ లేదు. నామటుకు మనిషి ఎలా సుఖశాంతులతో బ్రతకాలో తెలిపేది ఏదైనా మతమే. ఏమతంలో ఈ అంశాలున్నా వాటిని స్వీకరించడానికి నాకు అభ్యంతరం లేదు.

నేను వ్యతిరేకించేది మూఢాచారాల్నీ,మూఢనమ్మకాలని,అమానవీయ పద్ధతులను. మతం దానికి మూలంగా కనబడితోంది కాబట్టి, దాని ఔచిత్యాన్ని ప్రశ్నిస్తాను. అంతే తప్ప కేవలం వ్యతిరేకించడం కోసం మతాన్ని వ్యతిరేకించడం మరో మూఢత్వం కాబట్టి, నేను అలాంటి ధృక్పధాన్ని దరిజేరనివ్వను.

‘జీర్ణక్రియని ఆధారాలతోసహా స్వయంగా తెలుసుకుంటేగానీ మనిషి ఆహారం తినడానికి అర్హుడు కాదు’, అంటే బాగుంటుందా? మతం మొత్తాన్ని తెలుసుకునిగానీ మీరు గుడికెళ్ళరా?మరి నేను మతాన్ని ప్రశ్నించినప్పుడు మాత్రం “అరతెలివి” అంటే ఎట్లా?!?

****

December 16, 2008

మతమా…! కులమా…?

Filed under: మతం — kathimaheshkumar @ 10:10 am

కులచర్చలు అంత తొందరగా తెగేవీకాదు అంగీకారాత్మక నిర్ణయాలకు వచ్చేవీ కావు.అవి మన సామాజిక మనుగడనూ, ఆలోచననూ problamatize చేసి కొత్త సమీకరణాల్ని తయారుచెయ్యడానికేతప్ప సమస్యల్ని తీర్చడానికి ఎప్పుడూ ఉపయోగపడలేదు. ఇప్పట్లో అలా ఉపయోగపడే పరిస్థితీ కనిపించడం లేదు.

హిందూ మతస్థులు ఎప్పుడూ ఒక cohesive సమూహంగా వ్యవహరించ లేదు.ఒకే మతానికి చెందినవారిగా కొన్ని shared symbols ఉన్నప్పటికీ,ఆచారవ్యవహారాలు, విధివిధానాలు,సాంప్రదాయాలూ అన్నీ కులపరంగా ఏర్పరచబడ్డాయి లేదా అలాగే ప్రచారం కల్పించబడ్డాయి.

చాతుర్వర్ణాల సృష్టినుంచీ పంచమకులాల్ని చేర్చేవరకూ విభజించి పబ్బంగడుపుకునే బ్రాహ్మణక్షత్రియవర్ణాల ఆధిపత్య కుట్ర తప్ప మతపరిరక్షణ ఎవరి ఉద్దేశమూ కాలేదు. జ్ఞానాధారిత,రాజ్యాధికారాధారిత సంఘం నుంచీ భూమిఆధారిత సంఘం ఏర్పడే సరికీ నియో-క్షత్రియ (రెడ్డి,కమ్మ,బలిజ మొ”)కులాలు తమ అధికారాన్ని చెలాయించాయేతప్ప సర్వమానవ సమానత్వం ఎక్కడా చూపించలేదు. అందుకే ఇప్పుడు దళితులు మేము హిందువులం కాము పొమ్మంటున్నారు.

భూమినుంచీ రాజకీయం రాజ్యాధికారానికి మూలమవ్వగానే ఇవే కుల సమీకరణాలు ఆ వ్యవస్థమీద superimpose అయ్యాయి.అంటే వ్యవస్థ మారినా మూలాలు మాత్రం అవే అన్నమాట.ఓట్ బ్యాంక్ రాజకీయ క్షేత్ర్రంలో ఈ వర్గసమూహాల స్పృహ విజయవంతంగా ప్రతిసారీ reinforce చెయ్యబడింది.ప్రజాస్వామ్యంలో సమానత్వం తేవడంపోయి రాజకీయలభ్ధి కోసం కులాలు మరింత కరుడుగట్టిపోయాయి.కొన్ని కులాలు తమపై జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ కులాల ఉనికిని బలోపేతం చేస్తుంటే,మరికొన్ని తమకు సంక్రమించిన అధికారం ఎక్కడ కోల్పోతామో అన్న భయంతో మరింతగా ఈ కులవ్యవస్థని వ్యవస్థీకరిస్థున్నాయి.

ఇటువంటి రాజకీయబ్రహ్మాస్త్రాన్ని త్యజించి సమానత్వాన్ని కాంక్షించే ఆలోచన దాదాపు అన్నికులాల్లోనూ అడుగంటింది. ఇది హిందూమత సమస్య కాదు. ఇదొక ఆర్థిక-సామాజిక-రాజకీయ సమస్య.కులాలకి మూలాలు మతంలో వున్నా,అసలే అరవ్యవస్థీకృత హిందూమతంలో ఈ విస్తృత సమస్యను తీర్చే శక్తి లేదు.ఈ సామాజిక సమస్యకు మతపరమైన సమాధానం వెతికితే అది మరింత ప్రమాదకరమైన పరిణామం అవుతుందేతప్ప solution ఏనాటికీ కాదు.

కాబట్టి, కులాన్ని ఒక సామాజిక వర్గంగా చూసి ఆర్థం చేసుకుని ఆరాతీసి సమాధానాలు వెతకగలిగితే కొంతైనా సాంత్వన కలగొచ్చు. హిందూమత పరిరక్షణలో భాగంగా కులాలను విడనాడాలని పిలుపునిస్తే మాత్రం మతాన్ని వదిలేస్తారేమోగానీ కులాల్ని చాలా మంది వీడలేరు.ఆధ్యాత్మికతకు మతమైతే కులం ఆర్థిక-సామాజిక-రాజకీయ అధికారానికి హేతువు.ఈ ఒక్క కారణం చాలు మతాన్ని త్యజించి కులాన్ని తలకెక్కించుకోవడానికి.

‘హిందూఛారిటీస్’ అనే బ్లాగులో ‘కులమును విసర్జించండి’ అనే టపాకు నేను చేసిన వ్యాఖ్య ఇది.

****

December 1, 2008

టెర్రరిజాన్ని ఆపడానికి మనం ఏంచెయ్యాలి?

Filed under: మతం — kathimaheshkumar @ 9:14 am


ముంబై ఘాతుకం నేపధ్యంలో మనకు కలిగిన ఉక్రోశం, ఆవేశం,ఆవేదన మరియూ కోపాన్ని ఒక నిర్మాణాత్మక రీతిలో వెళ్ళబుచ్చే అవకాశం కోసం వెతికాను. అలాంటి ఒక అవకాశం దొరికింది.కొందరు ఔత్సాహిక సామాజిక కార్యకర్తలూ, సంస్థలూ, వ్యక్తులూ, ఉద్యోగస్తులూ, అంతర్జాతీయ సంస్థల్లో పనిచేస్తున్న కన్సల్టెంట్లు జనవరి 5, 2009 న హైదరాబాద్ లో ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.

హైదరాబాద్ పాతబస్తీలో ముస్లిం సముదాయ సామాజిక,ఆర్థిక అభివృద్ధికి పాటుపడుతున్న ‘రోషన్ వికాస్’ సంస్థకు సంబంధించిన ‘అలి అజ్గర్’ ఆధ్వర్యం(coordination)లో ఈ సమావేశం జరుగనుంది. 90 లలో జరిగిన హైదరాబాద్ మతకల్లోలాలను ఆపడానికి అలిఅజ్గర్ చేసిన ప్రయత్నాలు పాతబస్తీవాసులకూ, హైదరాబాద్ వాసులకీ విదితమే. ఈ చర్చల్లొ పాల్గొని పౌరులుగా గ్లోబల్ టెర్రరిజంకు వ్యతిరేకంగా మన గొంతులను నిర్మాణాత్మకంగా ప్రభుత్వంవరకూ చేరవేయడానికి ప్రయత్నిద్దాం.

ఇప్పటికి ఈ క్రింది విషయాలు 5వతేదీ సమావెశాల్లో చర్చించడానికి ప్రతిపాదించడం జరిగింది.

  1. టెర్రరిజంపై భారతీయ విధానాల గురించి ఒక పరిశీలన
  2. మైనారిటీ-మెజారిటీ వాదాలు : ప్రస్తుత ఎన్నికల విధానం
  3. పోలీసు సంస్కరణలు :రాజకీయనియంత్రణ: టెర్రరిజం
  4. టెర్రరిస్టులకు ఆయుధాల సరపఫరా చేసే అంతర్జాతీయ కంపెనీలను కట్టడి చేసేందుకు భారత్ నేతృత్వంలో ఐక్యరాజ్యసమితి ద్వారా ప్రయత్నానికి వ్యూహం.

ఇంకా ఏదైనా అంశాలు చర్చకు పెట్టదలిస్తే మెయిల్ పంపగలరు. aliasghar60@gmail.com
చర్చలో పాల్గొని తమవంతుగా policy recommendation -విధానపర సూచనలు అందించగలరు.

రాజకీయవ్యవస్థనూ, రాజకీయనాయకులనూ విమర్శించడం. రక్షణ,నిఘా,పోలీసు వ్యవస్థలలోని లోపాలను ఎత్తిచూపడం. మీడియాలోని అతిని ఎండగట్టడం చాలా సులువుగా మనం చెయ్యగలిగే పని. కానీ, మన మేధస్సును, సంవేదననూ, ఆలోచననూ మరింత అర్థవంతంగా ఉపయోగకరంగా తెలియజెప్పడం ప్రస్తుతం మన కర్తవ్యం. ఈ సమావేశంలో ఒక ఆచరణప్రణాళిక ఏర్పరుచుకుని రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ స్థాయిల్లో ఆ ప్రణాళికను ఎలా అమలుపరచాలనే ప్లానింగ్ కూడా చెయ్యబడుతుంది. భారతదేశ పౌరులుగా వివిధస్థాయిల్లో మనం గ్లోబల్ టెర్రరిజంపై పోరాటంలో ఏవిధంగా భాగస్వాములవ్వగలం అన్నది ఇక్కడ నిర్ణయించుకోవచ్చు. Let’s swing in to action. Let’s contribute our bit to the nation. Let’s contribute ideas, plans and proposals to combat terrorism. Let’s make India a safe place to live. Let’s make the world safe place to be in.

*****

November 30, 2008

మతం – మతవాదం – మతోన్మాదం

Filed under: మతం — kathimaheshkumar @ 8:24 am


ముంబై మారణహోమం నేపధ్యంలో మతాన్నీ, మతవాదాన్నీ, మతోన్మాదాన్నీ ఒకేగాటనకట్టి చాలామంది తమ భావజాల జాలాన్ని విజయవంతంగా అల్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ తరహా ప్రశ్నలు రాజకీయఉద్దేశాలను సాక్షాత్కరించగలవేగానీ సమస్యకు సమాధానాన్ని కాదు.

మతం: ఒక పుస్తకాన్ని,ప్రవక్తను లేక ఒక నిర్దేశించబడిన/ వివరించబడిన విధానాన్నిఆధారం చేసుకుని దాన్ని అనుసరించి జీవితాన్ని గడపడం. హిందూ మతం ఒక నిర్ధిష్టమైన code నుంచీ ఉద్భవించలేదు. కానీ క్రైస్తవం యూదుల మతానికీ రోమన్ సామ్రాజ్యానికీ వ్యతిరేకంగా ఉద్భవించింది, ఇస్లాం జుడాయిజం,క్రైస్తవంలోని అవినీతికి వ్యతిరేకంగా మహ్మదు ప్రవక్త సమర్పణ భావానికి ప్రతీకగా ఆవిర్భవించింది. నిజానికి ఇస్లాం అంటేనే భగవంతునికి సమర్పించబడింది అని అర్థం. క్రైస్తవం ఇస్లాం అవిఉద్భవించిన చారిత్రక స్థితినిబట్టి మతాలుగా వ్యాప్తిచేందే దిశలోనే మతవాదాలుగా మారిపోయాయి.

మతవాదం: ఒక రాజకీయ ప్రయోజనన్ని ఆశించి అనుకూలమైన మతం మాత్రమే పాలనకు అర్హమైనదిగా భావించడం. ఆ భావజాలం నేపధ్యంలో మిగతా మతాలను సమాన రాజకీయ అవకాశాలకూ పాలనాధికారాలకూ దూరం చెయ్యడం. ఒక విధంగా ఇతర మతాలను second rate citizens గా భావించడం. ఇస్లాం క్రైస్తవం సహజంగా నే ఈ విధానం వైపు త్వరగా మొగ్గుచూపినా హిందూ మతం ఈ ధోరణులనుంచీ దూరంగానే ఉంది. ముస్లింల దండయాత్రల నేపధ్యంలో కొంత ఈ భావజాలం కనిపించినా, ఆ తరువాత మొఘల్ కాలంలో (ఔరంగజేబ్ వరకూ) సద్భావనే వెల్లివిరిసింది. బిటిష్ కాలంలోకూడా మతాన్ని ఆధారం చేసుకుని రాజకీయ ప్రయోజనాలను బేరీజు చెయ్యలేదు. కానీ కాలక్రమంలో ముస్లింలీగ్ ఒకవైపు హిందూమహాసభ మరోవైపు (ఆ తరువాత ఆర్.ఎస్.ఎస్- సంఘ్ పరివార్) మతవాదానికి పెద్దస్థాయిలో తెరతీసారు. దేశవిభజన ఆ తరువాత పాకిస్తాన్ తో జరిగిన యుద్ధాలు మతపరమైన అపనమ్మకాన్ని ఒక రాజకీయ వాదాలరూపంలో, హిందుత్వవాదం పేరుతో బీజేపీ ఇప్పటికీ సజీవంగా నిలుపుతోంది. అందుకే మతవాదానికీ మతానికీ ఆధారం మతమే అయినా, రెంటికీగల తేడా గుర్తించడం అవసరం. కొందరి రాజకీయ ఉద్దేశాలకూ మతాన్ని నమ్మి జీవించే సామాన్యప్రజలకూ గల భావవైరుధ్యాన్ని తెలుసుకోవడం అవసరం.

మతోన్మాదం: తమ మతం తప్ప మిగతామతాలు అనర్హమైనవిగా భావించడం. తాము ఉత్తమమైనదిగా భావించే తమ మతస్థాపనలో భాగంగా ఇతర మతాల ప్రజలను హింసకు గురిచెయ్యడం, ప్రాణాలు హరించడం మతం ఇలా చెయ్యమని ఎక్కడా చెప్పదు. మతవాదం బలంగా వ్యాపించినప్పుడు ఆ మతాలకు చెందిన కొందరు ఈ ఉన్మాదస్థితిలోకి చేరే ఆవకాశం ఉంటుంది. ఈ ఉన్మాదానికి రాజకీయ, ఆర్థిక శక్తులు/ఆశయాలు తోడైతే ఉగ్రవాదంరూపంలో బయటపడుతుంది. వీరికి మతంతోకానీ, మతాన్ని అనుసరించే ప్రజలతోగానీ సంబంధం ఉండదు. ఒకస్థాయిలో వీరు పిచ్చివాడి చేతిలో రాయిలాంటివాళ్ళు. మరొకస్థాయిలో స్వయానా ఉన్మాదస్థితిలో ఉన్నవాళ్ళు. మతవాదుల చేతుల్లో బలమైన ఆయుధాల్లాంటివాళ్ళు. హిందుమతాన్ని పరిరక్షించడానికి. మాలెగావ్ లో బాంబులు పేల్చినా పాకిస్తాన్ ప్రోద్బలంతో ముంబైలో మారణహోమం చేసినా అది మతోన్మాదమేతప్ప మరొకటికాదు. ఈ మతోన్మాదాన్ని మతవాదంతో ముడిపెట్టి తమ రాజకీయపబ్బాలు గడుపుకునే నాయకత్వం వలన ఈ ధోరణి పెరుగుతుందేతప్ప అదొక ప్రత్యామ్నాయం అవుతుందని అనుకోవడం మన తెలియనితనమేతప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఆ రెండూ ఒకదానిమీద ఒకటి తమ అస్థిత్వాన్ని నిలుపుకునే విధానాలు.

ఈ తేడాలను గుర్తించకుండా కేవలం భావోద్వేగాలతో ప్రస్తుత పరిస్థితికి సమాధానం వెతకాలనుకుంటే మనకు మిగిలేది ద్వేషం, కసి, కోపమేతప్ప శాంతీయుతంగా జీవించడానికి మనం ఆశిస్తున్న మార్పుకాదు. ఈ విషయం గమనించి స్పందించడం చాలా అవసరం.

****

November 29, 2008

దిగులు..భయం కాదు మార్పుకోరుకునే కోపం కావాలి !

Filed under: మతం — kathimaheshkumar @ 6:20 am


ఏభావజాలాన్ని నమ్మినా, టెర్రరిజం యొక్క ముఖ్య ఉద్దేశం భీభత్సాన్ని సృష్టించి ప్రజల్లో భాయాందోళనల్ని కలిగించడం. వ్యవస్థమీద సామాన్యులకు అపనమ్మకాన్ని కలిగించటం.జీవితాల్లో దిగులు నింపి అసురక్షిత భావాన్ని కలిగించడం. ముంబై మారణహోమం నేపధ్యంలో వస్తున్న తెలుగు బ్లాగుల స్పందనల్ని చూస్తుంటే, తీవ్రవాదులు తమ ఉద్దేశంలో సఫలమైనట్లుగా అనిపిస్తోంది. ఆధునిక టెర్రరిజం యుద్ధం కాదు. అదొక ఉన్మాదం. ఉన్మాదాన్ని ఎదుర్కోవడానికి ప్రణాళికకన్నా, ఆత్మస్థైర్యం ముఖ్యం. అదే మనకిప్పుడుకావాలి. ముంబై పోలీసులూ, NSG కమేండోలూ అదే నిరూపించారు. మనకు దారి చూపించారు. టెర్రరిస్టులని చంపడంతోపాటూ వారి మూల ఉద్దేశాలను నిర్విర్యం చేసినప్పుడే గెలుపు మనవైపు నిలుస్తుంది.

ఇలాంటి పరిస్థితుల్లో మనం సురక్షితంగా ఉన్నామా? అనే ప్రశ్న ఉదయించడం సహజం. కానీ, ఆ అపనమ్మకం కలిగిందంటే తీవ్రవాదుల ఉద్దేశం సాకారమైనట్లే. ఒకవైపు వ్యవస్థవైఫల్యాలు తేటతెల్లంగా కనబడుతుంటే భయపడకుండా, దుగులుపడకుండా ఉండలేము. కానీ, మనలోని భయాన్ని మార్పుని ఆశించే ఆలోచనగా, మనలోని దిగులుని మార్పుకోసం పోరాడే నిర్ధిష్టమైన కోపంగా మార్చుకోవడం ఎంతో అవసరం. ఆ ఆలోచననీ, నిర్ధిష్టమైన కోపాన్నీ channelize చెయ్యడానికి తగిన ప్రాతిపదికని ఏర్పరుచుకోవడానికి ప్రయత్నిద్దాము.

ముంబై మారణహోమంలో మరణించిన సామాన్యులకూ, పోరాడుతూ ప్రాణాలు విడిచిన పోలీసులూ, కమెండోలకూ అశృనివాళి.

****

November 26, 2008

నాకు దేవుడు కావాలి

Filed under: మతం — kathimaheshkumar @ 10:50 am

‘దేవుడున్నాడా? లేడా?’ అనే ప్రశ్నలు చర్చిస్తే తెలేవీకాదు. ఒకరు నిర్ణయిస్తే ఆమోదించేవీ కావు. ప్రతిపాదిస్తే అంగీకరించేవీ కావు. అందుకని, అలాంటి చర్చలకన్నా ‘దేవుడు కావాలా? వద్దా?’అనడం సరైన పద్దతనుకుంటాను. వ్యవస్థీకృత మతానికీనాకూ చుక్కెదురైనా, దేవుడుంటే బాగుంటుందనిపిస్తుంది. నేనేదో ఆధ్యాత్మిక ధోరణిలోపడ్డానని అనుకోకండి. ఇక్కడా నాది తార్కికమైన స్వార్థమే!

మానవపరిణామ సిద్ధాంతం ప్రకటించినట్లు ఈజీవరాసులన్నీ “అలాఅలా” వృద్ధిచెందెయ్యకుండా, దేవుడు ఈ జగాన్ని సృష్టించివుంటే ఖచ్చితంగా ఒక ఉదాత్తమైన గమ్య ఒకటి జీవితాలకు ఏర్పడేది. అలాకాకుండా, డార్విన్ ను నమ్ముకున్నామనుకోండి. మనకు మిగిలేదల్లా అర్థరహితమైన, గమ్యహీనమైన కొండొకొచో అతలాకుతలమైన జీవితాలు. ఎందుకంటే, ఆ సిద్ధాంతం ప్రకారం జీవరాశులు వివిధ దశల్లో natural selection, survival of the fittest అంటూ ఏర్పడిపోయాయేతప్ప వాటికి higher purpose అనేవి లేవు. అలాంటప్పుడు మనుషులతోసహా ఈ జీవరాశులకు అలౌకికమైన గమ్యాలూ, ఉదాత్తమైన ఆలోచనలు అనవసరం. ఏదో పుట్టామా,బ్రతికామా, చచ్చామా అనేతప్ప మిగతావిషయాలు అనవసరం. కానీ, అలా వుంటే ఏమైనా బాగుంటుందా???

అందుకే, ఒక ఉదాత్తమైన ప్రయోజనం గమ్యం ఈ మానవజన్మకు కావాలి. జీవించడానికి ఒక అర్థవంతమైన కారణం కావాలి. కేవలం అవసరాలూ కోరికలూ తీర్చుకుంటూ బ్రతికేకన్నా,కొంత స్వార్థరహితంగా మరికొంత త్యాగమయంగా వుంటేనే జీవితం ఆసక్తికరంగా వుంటుంది. ‘ఇవన్నీ ఒక అలౌకికప్రయోజనం లేకుండా సాధ్యమా !’ అంటే, “కష్టమే” అని చెప్పుకోవచ్చు. నిస్వార్థంగా ఒకరినొకరు ప్రేమించుకోవడం. ఒకరినొకరు కాంక్షించుకోవడం. ఒకరికొకరు సాంత్వన చేకూర్చుకోవడం. ఇటువంటి భావాలకు జగత్ సంబంధిత (cosmic) ప్రయోజనం లేకుంటే, కేవలం లాభనష్టాలు బేరీజు చేసుకుని స్వార్థంకోసం అమలు జరిపేస్తాం. అందులో ఏమైనా తృప్తి వుంటుందా???

అందుకే మానవచైతన్యానికి ఒక అద్వితీయమైన అలౌకికప్రయోజనం కావాలి. అర్థరాహిత్యానికీ, అర్థంకాని ప్రయోజనానికీ మధ్య నన్ను ఎంచుకోమంటే ఖచ్చితంగా అర్థంకాని(అలౌకిక) ప్రయోజనాన్నే ఎంచుకుంటాను. అందుకే నాకు దేవుడు కావాలి. కాకపోతే ఆధునిక పోకడలైన సైన్సూ, లౌకికకవాదం,వ్యక్తివాదం ఎవ్వరూ ప్రశ్నించలేని ఆ ఉదాత్త జగత్ ప్రయోజనాన్ని పక్కనబెట్టి మతాలూ,పూజారులూ, నిబంధనలూ, సాంప్రదాయాలూ దేవుడ్ని ప్రశ్నార్థకం చేసేసాయి.

ఈ సందర్భంలో మా ప్రొఫెసర్ చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. ఆయన ప్రకారం “God is nothing but a center out side your own center. You need Him/Her some times.”

****

November 18, 2008

కొత్త బిచ్చగాడు

Filed under: మతం — kathimaheshkumar @ 8:20 am

కొత్తగా ఏదైనా నేర్చుకుంటే దాన్నే సమయం సందర్భం లేకుండా చేస్తూ, కనపడినవాడికి తమ కొత్త విద్యలోని నైపుణ్యాన్ని గురించీ, కొత్తగా నేర్చుకున్న విషయవిజ్ఞానాన్ని గురించీ చెప్పిచెప్పీ విసిగించి వేసారిపోయేలా చెయ్యడం మనం సాధారణంగా చేసేపని. అప్పుడే “కొత్తబిక్షగాడు పొద్దెరగడు” అని వ్యవహరించేస్తూ ఉంటారు.

విశాల్ భరద్వాజ్ హిందీ సినిమా ‘మఖ్బూల్’లో ఇలాంటిదే ఒక మతానికి సంబంధించిన సామెత చెబుతాడు. “నయా ముసల్మాన్ హై, పాంచ్ బార్ నమాజ్ తో పఢేగా హీ” అని. అంటే, ‘కొత్తముస్లిం కదా, ప్రస్తుతానికి ఐదుసార్లు నమాజ్ ఖచ్చితంగా చదువుతాడ్లే!’ అని అర్థం. ఈ విధంగా, కొత్తగా మతంపుచ్చుకున్నవాళ్ళలో ఈ ధోరణివుండటం సహజంగా జరిగిపోతూ ఉంటుంది. మాటిమాటికీ మతపరమైన references వాళ్ళమాటల్లో కనిపించేది అందుకే.

కొత్తగా మతంపుచ్చుకున్న ఒక క్రైస్తవ మిత్రుడి వింతధోరణి గురించి వాసిలి సురేష్ తన బ్లాగు ‘తెలుగు నేస్తమాలో’ రాసినటపా చదివేసరికీ, మా కాలేజిలో జరిగిన మతచర్చలు గుర్తొచ్చాయి. నేను చదివింది ఇంగ్లీషు సాహిత్యం, అందులో ఆధునిక సాహిత్యంలోని సింహభాగం చర్చ్ (Church) వ్యతిరేక సాహిత్యం గనక, మా చర్చల్లో మతం తరచూ receiving endలో ఉండేది. బైబిల్ గ్రంధాన్ని గురించికూడా ఆంగ్లసాహిత్య చరిత్రలో భాగంగా చదువుకున్న మాకు ఈ వింతపోకడల్ని సాధికారంగా ఖండించే అవకాశం ఉండటంతో, క్లాసులోవున్న క్రైస్తవ మిత్రులు తమ నిరసనని బాహాటంగా చెప్పేవారు కాదు. కానీ, క్లాసు ముగిసిన తరువాత కాస్త informal గా జరిగే మాటల్లో “మతాన్ని గురించి అలామాట్లాడితే ఎలా?” అనేవాళ్ళు.

ఈ సంవాదాల్లో జరిగేచర్చల్లో ముఖ్యంగా వచ్చే విషయాలు “మనమంతా పాపులం” అనే నమ్మకం. ఇతర మతాల దేవుళ్ళపటాలు,ప్రసాదాలూ తాకకూడదు. సినిమాలు చూడకూడదు,సినిమా సంగీతం వినకూడదు లాంటివి. మొదటి నమ్మకానికి కనీసం బైబిల్ లో కొంత ప్రాదిపదిక వున్నా, మిగతా రెండిటీకీ క్రైస్తవమతానికీ సుదూరంలోకూడా సంబంధం లేదు. కానీ,దినదిన వ్యవహారాలలో ఇలాంటివి మాటిమాటికీ ఎదురై, ఎప్పుడూ ప్రశ్నలు తలెత్తేవి. అందుకే తెగని చర్చలకు మూలమయ్యేవి.

మా ఫ్రొఫెసర్ ఒకాయన సరదాగా “పాపిగళూ బన్ని అంతా బోర్డ్ హాకి కరితారప్పా! నీవు హోగబేడ. నీ పాపియేనో?” అని కన్నడలో ప్రశ్నించేవాడు. అంటే, “పాపులారా రండి అని బోర్డుపెట్టుకుని మరీపిలుస్తారయ్యా! నువ్వెళ్ళకు. నువ్వు పాపివి కావుకదా?” అనర్థం. క్రైస్తవమతంలో original sin అనే ఒక భావన ఉంది.ఆడమ్- ఈవ్ భగవంతుడు నిషేధించిన (జ్ఞానఫలం)పండు (forbidden fruit) తినడం వలన దేవుడు సృష్టించిన పవిత్రలోకానికి దూరమయ్యారని. కాబట్టి, ఆడమ్-ఈవ్ సంతానమైన అందరిమనుషులూ పుట్టుకతో ఆ పాపాన్ని పంచుకుని పుడతారని ఒక నమ్మకం. ఆ పాపం నుంచీ పరిహారం పొందడానికి దేవుడిదారి ఎంచుకోవాలనే ఆధారంతో ఈ నమ్మకాన్ని మతవ్యాప్తికి బాగా ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయం మీద క్రైస్తవుల్లోని వివిధ శాఖల్లోకూడా బహు విభేధాలున్నాయి.

మా కాలేజి చర్చల్లో తేలిన conclusion ఏమిటంటే,‘if eating the fruit of knowledge is a sin, it’s good that the sin happened’ అని. జ్ఞానఫలం తినకుండా ఉంటే, మనిషి మనషిగా ఉండేవాడుకాదు కదా! అందుకే, ఆ “పాపం” జరగడం మంచిదనే నిర్ణయానికొచ్చేవాళ్ళం. ఆపని చెయ్యకుండా ఉంటే మనుషజాతికూడా అనభూతులులేని కూరగాయలో,జంతువులలాగానో ఉండేవాళ్ళంకదా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఆ పాపం, పాపమెలా అవుతుంది అనేది ప్రశ్నార్థకమే! అంతేకాకుండా, మతానికి ‘గిల్ట్’ (అపరాధభావన) ప్రాతిపదికైతే,దాంట్లో ఎస్కేపిజమే తప్ప జీవనమూల్యాల సాధన సాధ్యమా అనేది తరచూ ఉద్భచే సందేహం.

ఇక ఇతరమతాల దేవుళ్ళపటాలనూ,ప్రసాదాన్నీ తాకకూడదు అనేది కేవలం అపోహేతప్ప బైబిల్ ను ప్రాతిపదికగా చేసుకున్న నమ్మకమైతే అస్సలు కాదు. చారిత్రకంగా రోమన్ సారాజ్యానికి వ్యతిరేకంగా ఒక reactionary మతంగా క్రైస్తవమతం ఉధ్బవించినా, (ఆ తరువాత కాలంలో రాజకీయ ఉద్దేశాలతో ప్రారంభమైన క్రుసేడర్ సమయం మినహా) చాలావరకూ శాంతీ, ప్రేమలను ఆధారం చేసుకుని వ్యాప్తి చెందింది. అందుకే, ఇస్లాం మతంలో కనిపించే పరమతంపట్ల వ్యతిరేకత ( పేగన్లకు వ్యతిరేకంగా ఇస్లాంలో చాలా విధివిధానాలున్నాయి) కనబరిచే అవకాశం లేదు. అదీ ముఖ్యంగా “ఒక అంగీకారాత్మక ప్రాతిపదికన రాయబడిన” కొత్తనిబంధన గ్రంధం ఆవిధంగా ప్రవచించే అవకాశమే లేదు.

ఇక కొత్తక్రైస్తవుల సినిమా ప్రహసనం గురించి నా ఇదివరకటి టపాలో చెప్పాను చూడండి.

అందుకే, కొత్తగామతం పుచ్చుకున్నవాళ్ళ పోకడల్లో ఫాదర్లూ, పాస్టర్లూ, ఇతర మతప్రచారకులు నింపే అపోహల పాత్ర చాలా ఉందనిపిస్తుంది. హిందుమతంలోని అపోహలకు చాలా కారణాలుండొచ్చు. కారణం ఇక్కడ ఏక గ్రంధం,ఏక ప్రవక్త, ఏక దేవుడు లేడు. కానీ, క్రైస్తవం బైబిల్ కు కట్టుబడింది కాబట్టి (పేరే కొత్తనిబంధన గ్రంధం కదా!), నియో- క్రైస్తవులు కనీసం బైబిల్ ని పుర్తిగా చదువుకోవాలేమో!

****
Older Posts »

Theme: Banana Smoothie. Blog at WordPress.com.

Follow

Get every new post delivered to your Inbox.