రేరాజుగారు ‘బ్రాహ్మనికల్ ఆటిట్యూడ్’ అనే టపాకి సంబంధించిన చర్చల్లో నేను “బహుశా అది మన post vedic Hindu సంస్కృతి నుంచీ వారసత్వంగా వచ్చిన లక్షణం. దేవుడ్నీ, మతాన్నీ, సామాజిక నిర్మాణాన్నీ ఎవడూ ప్రశ్నించకుండా అన్నిటినీ “డెఫినిటివ్” చేసిపడేసారు. ఈ ధోరణికి ఆద్యులు బ్రాహ్మణులే అయినా, ఈ జాఢ్యం కులానికి అతీతంగా ఒక సామాజిక behaviour గా ఎప్పుడో మమేకం అయిపోయింది.” అని వివరిస్తే కొందరు దీన్నొక బ్రాహ్మణ ‘కుల’ ద్వేషంగానో లేక మరొక డెఫినిటివ్ స్వరంగానో పరిగణించడం జరిగింది. దానికి కొనసాగింపుగా “వేదకాలంనాటి హైందవానికీ అ తరువాత కాలంలో వచ్చిన వ్యవస్థీకృత హిందూమతానికీ చాలా తేడాలున్నాయి. ఉపనిషత్తుల్లో బ్రహ్మపదార్థమని చెప్పబడినది ప్రస్తుతం ఎక్కడుందో కాస్తవెతకండి! వ్రతాలు ఏ వేదాల్లో ఉన్నాయో కాస్త చూసిచెప్పండి! వేదకాలంలో చిల్లరదేవుడైన విష్టువు అత్యంత శక్తివంతుడైన దేవుడుగా ఎలా ఎదిగాడో కాస్త కనుక్కుని చెప్పండి! శివుడు త్రిమూర్తుల్లో ఒకడెప్పుడయ్యాడో కాస్త ఆరాతియ్యండి! కులవ్యవస్తా, వర్ణాశ్రమధర్మాలూ, పాపపుణ్యాలూ,స్వర్గనరకాలు ఎప్పుడు మన సంస్కృతిలోకి ప్రవేశించాయో కొంచెం తెలుసుకోండి! ఇవన్నీ ఒక వర్గం వారు తమ స్వార్థానికి తెచ్చిపెట్టిన లంపటాలు. వీటిని ప్రశ్నించకుండా “పవిత్రం” చేసిన ఘనత కూడా వీరిదే. వారెవరో కొత్తగా చెప్పాలంటారా?
వేదకాలంలో ఉన్న “నేతినేతి” సంస్కృతిని “ఇతిఇతి”గా మార్చిన ఘనత సామాజిక ఆధిపత్యాన్ని కాంక్షించిన సంస్కృతం తెలిసిన బ్రాహ్మణులదే. దీనికి చరిత్ర సాక్ష్యం.ఈ “ఇతిఇతి” నుంచీ బ్రాహ్మనికల్ ఆటిట్యూడ్ వచ్చిందని, అదొక సామాజిక ధోరణిగా మారిందని నా అంచనా. అదే నా నమ్మకం కూడాను. ఈ ఆలోచనకు ప్రత్యామ్న్యాయం లభించేవరకూ అదే నా “డెఫినిటివ్” అబిప్రాయం.” అని చెబితే, ఇందులోకూడా అర్థంకాని విషయాలు చాలా కనిపించాయి.
ఆ సందర్భంలో ‘dominant paradigm’ and ‘hegemony’ అనే రెండు పదాల్ని రేరాజుగారికిచ్చి, వీటి గురించి తెలుసుకొంటే బహుశా నా ధృక్కోణం మరింతగా తెలుస్తుంది అని చెప్పటం జరిగింది. అప్పుడు రేరాజు బీయింగ్ వాట్ హియీజ్, నన్నే ఒక టపారాసి పుణ్యంగట్టుకోమన్నారు. అందుకే ఈ ప్రయత్నం.
‘dominant paradigm’: ప్రచులిత విలువల సమాహారం – ‘hegemony’ : ఆధిపత్యం
ప్రతిసమయంలోనూ ప్రతి సమాజంలో కొన్ని నిర్థారిత విలువలు ప్రచులితమై ఉంటాయి. ఆ విలువలే ఆ సమాజాన్ని నిర్వచిస్తాయి, నాగరికత స్థాయిని నిర్థారిస్తాయి. ఈ విలువలు పూర్తిసమాజంలోని అన్నిపార్శ్వాలలోనూ ఒకటిగా ఉండకపోవచ్చు. ప్రతిపార్శ్వంలోనూ వివిధ స్థాయిల్లో కొన్ని నిర్ధిష్టమైన విలువలు ఏర్పడుతూ ఉంటాయి. అవి సాధారణమైన గాలివానలకు చెదరవు. ఈ విలువల్ని కూకటివేళ్ళతోసహా పెకిలించగలిగిన “మార్పు” వస్తేనే అవి సమూలంగా మారేదిశగా పయనిస్తాయి. ఇలాంటి సమూలమైన మార్పుల్ని “paradigm shift” అంటారు. చర్చ ఈ paradigm shift ది కాదు. చర్చ reinforcing the dominant paradigm అనే ప్రక్రియది.
ప్రచులితమైన విలువలవలన లాభం పొందుతున్న వర్గాలు ఎప్పుడూ తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలనే చూస్తారు. అది సహజం. ఈ ఆధిపత్య ధోరణిని hegemony అంటారు. వీటిల్లో ముఖ్యంగా cultural and social hegemony అనేవి బ్రాహ్మణభావజాలం (కులం కాదు) ద్వారా మన భారతీయ సమాజంలో, కొన్ని వర్గాల ఆధిపత్యానికి కొమ్ముకాసేవిధంగా అమలు జరపబడుతున్నాయి. ఈ ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకోవడానికి cultural and social imperialism అనే ప్రక్రియ ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఇది ఆదిమకాలం నాటి యుద్ధాలంతా ఘోరంగా ఉండవు. చాలా సున్నితంగా,సౌకుమార్యంగా,సాధికారంగా ఇతర సంస్కృతుల హననంగావించి, తమ ఆధిపత్యాన్ని చాటుతూ ఉంటారు. ఒక స్థాయికొచ్చేసరికీ ‘సంస్కృతి’ అంటే ఇదే! అనే స్థితికి ఈ hegemonic భావజాలం సమాజాన్ని తీసుకొస్తుంది.
ఈ ఆధిపత్యధోరణి ఒక కాలంలో కొన్ని వర్గాలవల్ల భారతదేశంలో అమలైతే, ఇప్పుడు మన స్థాయి పెరిగి అమెరికా వంటి దేశాల బారిన పడుతున్నాం. అంతేతేడా.
ఉదాహరణకు సంస్కృతి అనగానే మనకు గుర్తొచ్చే ప్రక్రియలేమిటి. నృత్యం, సంగీతం, ఆహార్యం. వీటిల్లో నాగరికమైనవి (అని అంటున్నవి) ఏవో ఒక సారి పరిశీలించండి. ఇవన్నీ ఎవరివి? పూర్తి జాతికి సంబంధించినవా? కేవలం కొన్నివర్గాలవారు “ఇదే సంస్కృతి” అని (మనకోసం) తీర్మానించడంవలన సంస్కృతిగా చలామణి అవుతున్నాయా?
ఇప్పుడు హెజిమొనీని సుస్థిరంచేసుకోవడంలో ఉపయోగికారి అయ్యే ‘reinforcing the dominant paradigm’ ప్రక్రియ గురించి ఆలోచిద్ధాం. ప్రస్తుతం అమలులోవున్న విలువలపై ఎవరైనా అభ్యంతరకరమైన ప్రశ్నలు లేవనెత్తితే లేదా బలీయమైన మార్పు రావాలి కోరుకుంటే, పురాతన కాలంలాగా వారిని వెలివెయ్యడం కుదరదుగనక, వారికి అదే విలువలలోని మరో పార్శ్వాన్ని కన్వీనియంట్ గా కరెక్టివ్ రూపంలో చూపి, “చూడు! విలువల్లో తప్పులేదు. అదిఅర్థం చేసుకుని అమలుచేసే మనుషుల్లోనే సమస్యంతా” అని మభ్యపెట్టి మూలాల్లో మార్పురాకుండా కాపాడుకుంటారు. అంటే అదొక చిన్న alteration అవుతుందేతప్ప “మార్పు” కాదన్నమాట.
ఉదాహరణకు కె.విశ్వనాధ్ సినిమాలన్నీ ఆ dominant paradigm ని reinforce చేసే సినిమాలే. నాకు బాగానచ్చిన సప్తపది తీసుకుంటే, ఆ కథాంశంలోని విలనూ హీరో రెండూ వేదాలే. ఇన్నివైరుధ్యమైన సంభవాలకు చోటునిచ్చిన “మార్మికమైన” వేదాల్ని త్యజించి “కొత్త విలువలు” సృష్టించాలని ఆ సినిమా వాదించదు. ఇప్పటి దాకా మనుషుల వలన తప్పుజరిగింది. “జ్ఞానం” వలన కాదు. ఇప్పుడు కొత్తగా ఆ జ్ఞానానికి భాష్యం చెబుతున్నాను కాబట్టి ఇంతవరకూ జరిగింది “తూచ్!” అని యాజులు చెప్పేస్తే, మనమంతా “ఆహా ఎంత గొప్పఆభ్యుదయ చిత్రం” అనుకుంటూ తలలూపుకొని అదే శాస్త్రాల్నీవేదాల్నీ నెత్తినెత్తుకుని ఊరేగుతాము. ఏమిటయ్యా అంటే, `ఏదో కొందరి స్వార్థంతో అజ్ఞానంతో “తప్పు” జరిగింది. అంతమాత్రానా మొత్తాన్నీ కాదనుకుంటామా? ఎంత ఉదాత్తమైన విలువలూ!’ అనుకుంటూ సంబరపడిపోతాము.
నా ఉద్దేశంలో బ్రాహ్మణికల్ ఆటిట్యూడ్ కూడా ఈ పరిణామక్రమంలో ఒక hegemonic ఉపకరణగా, dominant paradigm ని reinforce చేసేది మాత్రమే. Paradigm shift కోసం ఎవరు ప్రయత్నించినా ఈ శక్తులు తమ యుక్తులతో చేతనంగా, ఉపచేతనంగా క్రియాశీలకంగా అడ్డుతగుల్తూనే ఉంటాయి.
రేరాజు అడిగిన ఈ క్రింది మూడు ప్రశ్నలకూ సమాధానం పైన చెప్పబడిన “వ్యవస్థే”కారణం.
1.తెలుగు మీద జరుగుతున్న ఇంగ్లీషు “అణచివేత” గురించి – వేర్ డు వి స్టాండ్!?
2.తెలుగు సినిమా మీద జరుగుతున్న “అణచివేత” గురించి – వేర్ డు వి స్టాండ్!?
౩.భారత దేశం మీద జరుగుతున్న “అణచివేత” మీద – వేర్ డు వి స్టాండ్!?
ఈ వివరణ కొంత oversimplification అయినా, మూలభావనలకు విఘాతం కలిగించేవి కావు.
*****