లైంగికత ఒక శారీరక స్పందన. నైతికం ఒక సామాజిక కట్టుబాటు. మొదటిది సహజం. రెండవది సమాజనిర్మితం. లైంగికత హద్దులుదాటితే, సమాజంలోని నిర్ధిష్టత,ప్రామాణికత దెబ్బతింటాయన్న ఉద్దేశంతో, ఈ సహజత్వాన్ని హద్దుల్లో పెట్టడానికి నైతికత అనే కృత్రిమ కంచె ఏర్పాటు చెయ్యటం జరిగింది. కాకపోతే, ఇక్కడకూడా men are more equal than women అయిపోయారు. ఈ లింగవివక్షతోకూడిన నైతిక నిర్వచనాల స్థాపనలో, శారీరక గుణాలపాత్ర చాలా వుందని తెలుసుకోవడం ముఖ్యం. ఈ నిజాన్ని ఎంత విస్తృతంగా తెలుసుకుంటే, అంతే విశదంగా ‘నైతికతే మన సమాజంలోని లింగవివక్షకు మూలం’ అనే సత్యం గోచరిస్తుంది.
‘శారీరక కలయిక గర్భాదానానికే!’ అనేది మన శాస్త్రాలు చెప్పే విషయం.ఇలాంటి మాటలే దాదాపు అన్ని మతాల్లోనూ చెప్పడం జరిగింది. అది చాలావరకూ నిజం కూడాను. లైంగికతలోని మూల ఆశయం పునరుత్పత్తి (procreation). ప్రతిజీవీ తన సంతతిని వృద్ధిచేసుకుంటూ మనుగడ సాగించడం ఈ లైంగికత ద్వారానేసాధ్యం.అందుకే ఈ ప్రక్రియకి పవిత్రత ఆపాదించబడింది. ఆ పవిత్రత ఆధారంగా, కలయికకి సంబంధించిన కొన్ని నియమాలు సృష్టించబడ్డాయి. ఈ సందర్భంలో ఆడవారికీ మగవారికీ గల మౌళికమైన తేడాను గుర్తించడం అవసరం. మగవారు పవిత్రత మీరినా, నియమాల్ని వుల్లంఘించినా వాటికి ఆధారాలు లభ్యంకావు.కానీ, అదేపని ఆడది చేస్తేమాత్రం ఆక్షణంలో కాకపోయినా మరో కొన్నివారాలకి సమాజ ప్రామాణికతను దెబ్బతీసే ఆధారాలతొసహా పట్టుబడుతుంది.
‘దొరికితేనే దొంగలు’ అనేది మన సామాజిక న్యాయసిద్ధాంతం కాబట్టి, ఈ దొరకని దొంగలకి మినహయింపునిచ్చేసి, దొరికే దొంగల మీద ప్రత్యేకశ్రద్ధ పెట్టడం జరిగింది. మన పూర్వజులు బహుతెలివైనవారూ, మానవప్రవృత్తిని కూలంకషంగా అర్థం చేసుకున్నవారూ కనక, దొంగ చేతికే తాళాలిచ్చేసారు. ఆ తాళాలే “సుసంపన్నమయిన మన సంస్కృతీ సాంప్రదాయాలకు పట్టుగొమ్మలయిన స్త్రీమూర్తులు” అనే బాధ్యత. కుటుంబ గౌరవం, వంశప్రతిష్ట, సంస్కృతీ సాంప్రదాయాల తాళాలు ఈ విధంగా సమకూరినవే.
ఈ తాళాలను మోస్తూమోస్తూ అదేతమ జీవితాశయంగా బ్రతికెయ్యడం మొదలయ్యింది. సమయం మారింది. పరిస్థితి మారింది. ఆశయాలు మారాయి.ఆదర్శాలు మారాయి. కానీ, ఇవేమీ పట్టనట్టుగా మన నైతిక నిర్వచనం మాత్రం మారలేదు. తాళాలిచ్చిన దొంగలుకూడా, ‘నిజంగా ఇది మా బాధ్యతే కామోసు’ అన్న గౌరవప్రదమైనభ్రమలో జీవించడం కొనసాగించారు.లింగవివక్ష వేళ్ళూనుకుంది, నైతికతని లైంగికత, లైంగికతని నైతికతా విడదియ్యరాని సామాజిక పార్శ్వాలుగా వర్ధిల్లుతున్నాయి.
ఒకసారి సమాజం మతం నైతికతకు ఇచ్చే నిర్వచనాన్ని చూసి తరువాత ఆధునికయుగంలో జరిగిన మార్పుల నేపధ్యంలో వాటిని బేరీజు చేద్దాం.
1.కలయిక ఉద్దేశం గర్భధారణకాబట్టి అది అత్యంతపవిత్రమైన కార్యం.
2. ఆ పవిత్రకార్యం పెళ్ళితరువాతనే జరగాలి.
3. కలయికద్వారా సంభవించే సంతానానికి తల్లిదండ్రులిద్దరూ బాధ్యత వహించాలి.
ఆధునిక యుగంలో గర్భనిరోధకాలద్వారా గర్భధారణతో సంబంధం లేని కలయిక సంభవం,సాధారణం. కాబట్టి, కలయికకు ఆపాదించబడే పవిత్రతకు స్థానం లేదు. పెళ్ళి అనేది ఐచ్చికం (optional) కాబట్టి, పెళ్ళి కలయికకు అత్యవఅవసరమైన షరతు అసలు కాదు. ఇక్కడ పిల్లల ప్రసక్తి లేదుకాబట్టి బాధ్యతాయుతమైన కలయిక అంటే, ఈ కలయిక ద్వారా పిల్లలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం. ప్రస్తుతం ప్రాణాంతకమైన వ్యాధులు సంక్రమిస్తున్నాయి కాబట్టి అవి సంక్రమించకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవడం.
ఈ ఆధునిక మార్పుల నేపధ్యంలోంచీ చూస్తే, పైన చెప్పిన మూడు నిబంధనల్నీ ఇలా మార్చుకోవచ్చు.
1.కలయిక ఉద్దేశం చాలావరకూ ఆనందం. అప్పుడప్పుడూ మాత్రమే గర్భధారణ
2. పెళ్ళికీ కలయికకూ ఎటువంటి బాదరాయణ సంబంధం లేదు.
3. కలయిక ఇరు పక్షాల సమ్మతంతో, బాధ్యతాయుతంగా జరగాలి.
ఒకప్పుడు స్త్రీకి తన శరీరంపైన ఎటువంటి నియంత్రణా లేదుకాబట్టి, అప్పటి పరిస్థితికి అనుగుణంగా లైంగికతను నిర్దేశించే నైతికతను ఆపాదించడం జరిగింది. కానీ,మారిన నేపధ్యంలో కూడా అవే కొనసాగటం మాత్రం కొంత సామాజిక కుట్రలో భాగం అనిపించకమానదు.
అంతెందుకు, వ్యవస్థీకృత కలయిక జరిగే పెళ్ళిలో కూడా గర్భాధారణతోపాటూ, పెళ్ళి అనే సంబంధం ప్రేమతో కలకాలం కొనసాగే ప్రక్రియలో భాగంగా గర్భనిరోధక కలయికను ఆమోదిస్తున్నప్పుడు, దానికి ఇంకా procreation పవిత్రతను అంటగట్టడం అర్థరహితం. అలా చెయ్యటం లేదుకాబట్టి, ప్రేమించిన స్త్రీ ఆ ప్రేమకారణంగా సుముఖంగా గర్భందాల్చడానికి ఇష్టపడిందని అనుకోవాలి.అంటే, ఇక్కడ స్త్రీ ఇష్టానికిగల ప్రాధాన్యత ముఖ్యంగానీ పెళ్ళి అనే వ్యవస్థకున్న ప్రాముఖ్యత నగణ్యం. కారణం, పెళ్ళైనంతమాత్రానా భర్తతో బలవంతంగా కాపురం చెయ్యాలి లేక పిల్లల్ని కనివ్వాలన్నది చట్టరీత్యా నేరం కాబట్టి.
స్త్రీకి తన శరీరంపైన తనకుగల సంపూర్ణహక్కుల నేపధ్యంలో,ఆ హక్కుల్ని కాపాడుకునే సాంకేతిక జ్ఞానం మరియూ విజ్ఞానం యొక్క లభ్యత దృష్ట్యా పవిత్రతలూ, నైతికతలకు కాలం చెల్లిపోయిందనే సైద్ధాంతిక రూపేణే భావించాలి.కానీ, మన సమాజిక నిర్మాణం,వ్యవస్థా ఈ మార్పులకి అనుగుణంగా ప్రస్తుతానికైతే అగుపించడం లేదు. లైంగికతను శాసించే నైతికతలు పోయి, స్వతంత్ర్యంగా లైంగికతను ఒక వ్యక్తియొక్క ఆద్శావకాశం (informed choice)గా నిర్ణయించుకునే మార్పు వస్తుందని ఆశిద్దాం.


