పర్ణశాల

June 12, 2009

కథ వెనుక కత/సొద

Filed under: కథ, సాహిత్యం — kathimaheshkumar @ 12:06 pm

గాల్లోంచీ పుట్టడానికి కథలు స్వాములోరి విభూధో, లింగాలో కాదు కదా! ఈ కథా గాల్లోంచే పుట్టలేదు. నా స్వీయానుభవాల్లోంచీ కాకపోయినా, నేను చూసిన ఘటనల్లోంచీ పుట్టింది. నాకు పరిచయమున్న మనుషుల్లోంచీ పుట్టింది. విడివిడి అనుభవాల్నీ, విభిన్నమైన ఘటనల్ని, వేరువేరు మనుషుల్ని ఒక్క తాటితో బంధించి ఒక్క కథగా చెబుతామన్న నా ఆలోచనలోంచీ వచ్చింది. అక్కడ్నించీ ప్రారంభమయ్యింది నా కథ వెనుక కథ.

కథ రాయాలి అనుకున్నాక, ‘కథే ఎందుకు’ అనే ప్రశ్నకాక ‘కథంటే ఏమిటి’ అనే అంతర్మధనం మొదలయ్యింది. ఈ మధ్యకాలంలో బ్లాగుల్లో రాసేది సాహిత్యమేనా! పేరున్న పత్రికలూ వాటి సంపాదకులూ “వాహ్ వాహ్” అనకుంటే ఆ కథకు అస్తిత్వం ఉంటుందా? అనే కొసరు ప్రశ్నలనుంచీ, అసలు కథంటే ఏమిటి అనే అసలు ప్రశ్న ఉదయించింది. అంటే నేను చిన్నప్పుడు చందమామా,బాలమిత్ర చదవలేదని కాదు. పెద్దయ్యాక కొడవటిగంటి, చిట్టిబాబు,మధురాంతకం రాజారాం, చలం కథలు ఎరగక కాదు. సమస్యల్లా అవి ఎరిగుండటమే అనిపించింది. ఎందుకంటే వాళ్ళెప్పుడూ కథను నిర్వచించలేదు. కథల్ని సృష్టించారు. కథన రీతుల్ని కవ్వించారు. కథాశైలిని నర్తింపజేసారు. ఏ ఒక్కరి కథాగమనం మరొకరితో పోల్చలేం. ఏ ఒకరి మూసనూ ఇదే కథ అని తేల్చలేము. అంతెందుకు, మధురాంతకం గారు స్వయంగా తెలుగు కథా చరిత్ర గురించి రాసిన ‘కథాయాత్ర’ లో తెలుగు కథ పరిణామం, పాత్ర చిత్రణల్ని గురించి చెప్పారేగానీ తెలుగు కథకు ఈ లక్షణాలే ఉండాలని శాసించలేదు. కానీ,ఇప్పుడు ఒక ‘కత’ చెబితే “అబ్బే ఇది కథలాగా లేదే” అనే నిర్ణయస్వరం బహుగాఠ్ఠిగా వినిపించేస్తున్నారు. ఇక మంచికథ, గొప్పకథ, ప్రమాణాల్లో తూగే కథ అని నానారకాల లేబుళ్ళు కూడా తయారయ్యాయి. అందుకే నేను రాసిన తరువాత “ఇది కథ కాదు. నాకు కథ అంటే ఏమిటో తెలీదు” అనే డిస్క్లైమరొకటి పడేద్దామనుకుని రాయడం మొదలెట్టాను.

నాకు తోచినట్లు, నేను అనుకున్నట్లు రాసేసాను. తీరా రాశాక, ఇప్పుడింకో తంటా. కొందరు మిత్రులకి రహస్యంగా చూపించాను. కొంచెం పరిణితి కనిపించిందన్నారు. కొంత ఎడిటింగ్ అవసరం అన్నారు. “నువ్వే కనిపిస్తున్నావ్ నీ పాత్రలెక్కడా?” అని ప్రశ్నించారు. కథా వస్తువు బాగుంది కానీ పాత్ర చిత్రీకరణ “ప్చ్” అని పెదవి విరిచారు. “డిటెయిల్స్ ఎక్కడా? వర్ణనలు ఏవి?” అని గద్ధించారు. “బ్లాగులో కావాలంటే పెట్టుకో పత్రికలకు పంపితే ఇంతే సంగతులు చిత్తగించవలెను” అన్నారు. కనీసం వెబ్ పత్రికలకు పంపించు వారి ఫీడ్ బ్యాక్ మంచి చేస్తుందేమో అన్నారు. కథలో ఉన్న లోటుపాట్లేమిటో ఇది కథగా ఎందుకు క్వాలిఫై కాదో తెలుసుకుందామని ప్రయత్నిస్తే ఒకరు సహృదయతతో “అసలు కథ ద్వారా ఏంచెప్పలనుకున్నావు?” అని అడిగారు. దిమ్మతిరిగిపోయిందంటే నమ్మండి. చచ్చీచెడీ చెప్పాలనుకున్నది కథరూపంలో చెప్పేస్తే, ఏంచెప్పాలనుకున్నావని అడిగితే ఎలా!

ఒక స్నేహితుడు శ్రమపడి వాక్య నిర్మాణాన్ని సరిదిద్ది ప్రవాహంలో అర్థాలు కోల్పోతున్న వాక్యాలకూ ఊతమిచ్చి ఒడ్డుకు చేర్చారు. మరో మిత్రుడు “నీ అభిప్రాయాలను పాత్రల చేత పలికించి, నీ భావాలను పాఠకులపై ఎందుకు రుద్ధాలనుకుంటున్నావు?” అని సూటిగా ప్రశ్నించాడు. “కథ రాసింది నేను. ఈ ఆలోచనలు పాత్రల రూపంలో అయితే బాగుంటాయని నిర్ధారించింది నేను. ఆ భావలకు భాషనందించి ఒక రూపుదిద్దింది నేను. అలాంటప్పుడు ఈ కథ ‘నా కథ’లాగా కాకుండా పాత్రల కథగా ఎందుకుండాలి?” అని ఎదురు ప్రశ్నిస్తే నీ తలరాత అని తప్పుకున్నాడు. అంతటితో ఆగుతానా, పాఠకులపై నేను రుద్ధడమేమిటి? అని ప్రశ్నించాను. తన దగ్గర నుంచీ సమాధానం లేదు. ఇక భావాల సంగతంటావా, ఎంత మంది తమ ప్రేమ రొదల్ని కవితలుగా అల్లటం లేదు. ఎంత మంది తమ విరహ వేదనల్ని కావ్యాలు చెయ్యటం లేదు. మరి నేను నా భావాలను కథగా రాస్తే తప్పేమిటి అనిపించింది. అంతగా అయితే దీన్ని అభిప్రాయాల కథ, ఆలోచనల కథ, సొంత భావాల కథ, మహేష్ భావజాలం కథ అని ఎన్నైనా అనుకో అని ఆ మిత్రుడికి వెసులుబాటు కల్పించేశాను. ఎవరో ఒకరు పుట్టిస్తేగానీ భాషలో పదాలు పుట్టనట్లు, కొందరు మనుషుల్ని కలగలిపితేగానీ ఒక కథాపాత్రవ్వదుకదా! కొన్ని ఆలోచనల్నీ, అభిప్రాయాల్నీ వారిలో నింపితేగానీ ఆ పాత్రలకు రూపం రాదుగా! మరి ఆ ఆలోచనలూ, అభిప్రాయాలూ రచయితవైతే వచ్చిన తప్పేమిటి? లేదా రచయిత ఆశించినవైతే వచ్చే నష్టమేమిటి అనేవి సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.

ఈ కథకాని కథకొస్తే… అసలు ‘దేవత’ అనే పదానికి నెగిటివ్ అర్థం వచ్చేలా చూడొచ్చనే ఆలోచన కలిగించిన మిత్రుడు హరీష్ కు శీర్షిక క్రెడిట్ ఇవ్వాలి. కాలేజిలో ప్రియ అని మధురై నుంచీ ఒక జూనియర్ ఉండేది. చాలా అందమైన పిల్ల. ఎంత అందమంటే…నిజంగా కల్పనల్లోని దేవతలాగా, రవివర్మ పెయింటింగ్ లోని దేవతలాగా ఉండేది. ఒకసారి ఆ అమ్మాయి అందాన్ని పొగుడుతూ ఉంటే హరీష్ అన్నాడు “నిజమే ఆ అమ్మాయి దేవత. నీకూ నాకూ ఇక్కడున్న అందరికీ పూజించి ఆరాధించడానికి తప్ప మరెందుకూ పనికిరాని దేవత” అని ఎత్తిపొడిచాడు. అప్పుడనిపించింది, what a way of looking at it అని. అద్వితీయమైన మంచితనాన్ని కూడా దేవతల లక్షణంగా చెబుతాం. కానీ, ఆ మంచితనాన్ని సాధారణమైన మనుషులు భరించలేరు. అలాంటిది, ఒక స్త్రీ మగాడితో సమానంగా వ్యవహరిస్తేనే భరించలేని వ్యక్తికి ఒక బలమైన వ్యక్తిత్వం కలిగిన స్త్రీ ప్రేమిస్తే ఆమెనుకూడా భరించలేడు అనే ఆలోచన ఎప్పటి నుండో ఉండేది. అలా ప్రారంభమయ్యింది ఈ దేవత కథ.

హేమంత్ పాత్ర కొంత నేను మరికొంత నాకు బాగా తెలిసిన కొందరు మగాళ్ళ మనసుకు, ఆలోచనకూ రూపం. చిన్నప్పటి నుంచీ నూరిపోయబడిన ‘మగతనం’, మారుతున్న ఆధునిక నగరీయ జీవితంలోని అంగీకరించలేని ‘లైంగిక సమానత్వం’ మధ్యన వ్యక్తిత్వాన్ని విశాల పరుచుకుంటున్నామో లేక కోల్పోతున్నామో తెలియని యువతకు ప్రతినిధి హేమంత్. పర్వర్టో, దుర్మారుడో కాదు. కేవలం గుర్తింపు రాహిత్యం (identity crisis)లో కొట్టుమిట్టాడుతున్న సాధారణమైన మగాడు. హేమంత్ ని విలన్ ని చెయ్యడం చాలా సులభం. తనలో ఒకే క్షణంలో ఉద్భవించే ఉన్నత భావాలు, లేకి అభిప్రాయాల మధ్యనున్న వైరుధ్యాల్ని ఆరా తియ్యడం మరీ సులభం. కానీ అంతకన్నా తన “ఉదాత్తమైన వెధవతనాన్ని” సహానుభూతితో అర్థం చేసుకోవడం చాలా అవసరం అనిపించింది.తన ఆలోచనల్లోని బలహీనతల్ని తన నమ్మకాలుగా చెప్పించడం ద్వారా, పాత్ర వెధవ అని తేలుతుంది. కానీ తన నమ్మకం పట్ల సానుభూతిని మిగులుస్తుంది అనిపించింది. అందుకే కథను ప్రధమ పురుషలో తన తరఫునుంచీ చెప్పించాలనిపించింది. ఎలాగూ హేమంత్ నాలో కొంత భాగం, నాకు తెలిసిన ఇతరుల ఆలోచనల రూపం కాబట్టి కథకుడిగా కథను ‘నడిపించడం’లో వెసులుబాటు ఉంటుందని అలా కానిచ్చేసాను.

నిజానికి నాదృష్టిలో హేమంత్ నిజమైన హీరో. తనకు సామాజిక సంక్రమణలుగా లభించిన బలహీనతల్ని నమ్మకాలుగా మలుచుకుని, ఆ నమ్మకాల కోసం సుప్రియ ప్రేమను త్యజించిన హీరో హేమంత్. సాధారణంగా హీరో అంటే మారాలి. తన బలహీనతల్ని అధిగమించి “మంచి”గా మారాలి. కానీ ఈ హీరో ట్రాజిక్ హీరో. తన బలహీనతల కోసం వెధవలాగా పాఠకుల మనసుల్లో మిగిలిపోయే నాయకుడు. అలా మిగిలిపోతూ కూడా మగపాఠకుల మనసుల్లో కొన్ని ప్రశ్నల్ని నిలిపే హీరో. కథ చదివిన మగపాఠకులు బయటకు ఒప్పుకోకపోయినా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి ఆలోచనలు అసంకల్పితంగానే ఎప్పుడో ఒకసారి తమకూ వచ్చాయనే స్పృహ కలిగించే ధీరుడు. ఇక స్త్రీపాఠకులు ఖచ్చితంగా identify చేసుకోగలిగిన హీరో అని ప్రత్యేకంగా చెప్పనఖ్ఖరలేదనుకుంటాను.

సుప్రియ పాత్రలోని యాక్సిడెంట్ ఘట్టం. కుడిచేయి పోతే ఎడమచేత్తో మళ్ళీ వెనువెంఠనే జీవితాన్ని ప్రారంభించిన ఘట్టాలు నిజంగా నాకు తెలిసిన అమ్మాయి జీవితంలో జరిగిన విషయాలు. కలిసి పెట్టే ఖర్చును లెక్కేసి మరీ వెనక్కిచ్చేస్తే లక్షణమూ నాకు పరిచయమున్న కొందరు స్నేహితురాళ్ళకుంది. వాళ్ళ లాజిక్ సింపుల్ “కలిసి ఖర్చు పెట్టాం. కలిసి షేర్ చేసుకుందాం”. ఇందులో అఫెండ్ అవడానికి ఏమీ లేకున్నా, కొందరు మగవాళ్ళు తమ మ్యాగ్నానిమిటీకి దెబ్బ అనుకుంటారు. ఈ లక్షణాలన్నింటినీ కలగలిపినా సుప్రియ పాత్ర సృష్టి కష్టమే అనిపించింది. ఎందుకంటే she is just a manifestation of insecurity in many of the men. కాబట్టి తన పాత్రకన్నా హేమంత్ ఆ పాత్రద్వారా పొందిన “ఆత్మన్యూనత” కథాంశమైతే బాగుంటుందనిపించింది. కాబట్టే ఎక్కడా సుప్రియ వర్ణన లేదు. తను అందంగా ఉంటుందా, పొడుగ్గా ఉంటుందా అనే ప్రశ్నలకు సమాధానం ఎక్కడా దొరకదు. తన బాహ్యసౌందర్యంకన్నా, తన బలమైన వ్యక్తిత్వంకన్నా తను హేమంత్ లో రేపే ఇన్సెక్యూరిటీ ఈ కథలో నేను చెప్పాలనుకున్న విషయానికి ముఖ్యం అనిపించింది. అందుకే సుప్రియ కథలో ఎక్కడా కనిపించదు.

ఇక “ప్రేమించడంలో” స్త్రీ యాక్టివ్ పాత్ర తీసుకుంటే తమ మగతనానికి ఛాలెంజ్ అనే విధంగా ప్రయత్నించేవాళ్ళే కాకుండా, తీవ్రమైన ఇన్సెక్యూరిటీ పాలయ్యేవాళ్ళు (చెప్పరుగానీ) చాలా మందే. ఈ లక్షణాలనన్నింటినీ కలగలిపి హేమంత్ ని తయారు చేశాను. He is the best hero I have created అని నాకైతే అనిపించింది. ఇంకెవరికైనా మరోలా అనిపించుంటే నేను చెయ్యడానికి ఏమీ లేదు.

కొసమెరుపు ఏమిటంటే, ఈ కథని ఒక వెబ్ పత్రికకి పంపించాను. వారి సమాధానం

“మహేష్ కుమార్ గారూ,

మీరు పంపిన “దేవత” కథ —- నాణ్యతాప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడం వల్ల ప్రచురించలేకపోతున్నాం. మీనుంచి మరింత ఉన్నత ప్రమాణాలతో కూడిన రచనలను ఆశిస్తూ

నెనరులతో
———–”

అప్పుడనుకున్నాను. పత్రికా ప్రమాణాలను బట్టి నేను కథరాయాలా? నా నమ్మకాలే ప్రమాణాలుగా కథరాయాలా? అని. ఎందుకో రెండోదే బెటర్ అనిపించింది. ఈ మధ్య అబ్రదబ్రగారి చర్చల్లోకూడా దాదాపు ఇలాంటి యక్షప్రశ్నలే ఎదురయ్యాయి. I write because I want to write. Then its better I stick to my blog writing. అనుకుంటున్నాను. హేమిటో ఈ ప్రమాణాలూ, నాణ్యతలూ నాకైతే అర్థం కావు. రాసుకుంటూ పోవడమే మ తరహా!

(బ్లాగులున్నదే సొంత కతలు చెప్పుకోవడానికి. కాబట్టి నా స్వోత్కర్ష మీకు తప్పదు)

******

June 10, 2009

దేవత

Filed under: కథ — kathimaheshkumar @ 11:14 am

బలమైన వ్యక్తిత్వంగల ఆడది మగాడ్ని ఆత్మన్యూనతకు గురిచేస్తుంది. మగ అహం, మగాలోచన,మగాహంకారం,మగభావాలు ప్రశ్నింపబడ్డాక మగటిమి ప్రశ్నార్థకమౌతుంది.కొన్ని వేల సంవత్సరాలుగా మగాడి నరనరాల్లో నిక్షిప్తమైన మగసంస్కృతి పతనమౌతుంది. సుప్రియ అలాంటి ఆడది. పరిచయమయినప్పటి నుంచీ అంతే. నేను మగాడినన్న స్పృహేనాకు కలిగించలేదు. మగాడన్న స్పృహే తడబడ్డాక ఆడామగా మధ్య ఉన్న బంధం నిలుస్తుందా? ఆ విషయం ఇప్పుడైనా అర్థం చేసుకుంటుందనుకున్నాను. ఎంతైనా, ‘తను ఆధారపడటం నేర్చుకునే సమయం వచ్చిందికదా!’

****
జీన్సు వేసుకునే ఆమ్మాయిల ఆప్రోచబిలిటీ గురించి నేను చేసే ప్రతిపాదనల్ని క్లాస్ రూంలో ఒకమూల సైలెంటుగా కూర్చుని వింటుండగా మొదటిసారి చూశాను. అప్పుడే సుప్రియ నన్ను చూసి కళ్ళతోనే ఫక్కున వెక్కిరించినట్టనిపించింది. ఆ తరువాత నెలపాటూ, మా పరిచయం మొదలయ్యేవరకూ ఆ వెక్కిరింపే నన్ను వెంటాడింది. బెంగుళూర్ అమ్మాయిలంటే నాక్కొంచెం చులక భావం. ముఖ్యంగా అప్పర్ మిడిల్ క్లాస్ అమ్మాయిలంటే మరీను. మేకప్పు, మార్కుల మీదున్న శ్రద్ధ వీరికి మనుషుల మీదుండదు. తమ వీకెండ్ ప్లాన్స్ మీదున్న ఆసక్తి వల్డ్ దిసి వీక్ (World This Week) మీదుండదు. హాలీవుడ్ సెలబ్రిటీలు ఫింగర్ టిప్స్ మీదుంటారుగానీ, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ సినిమాల గురించి తెలీదు. ప్రపంచమంతా బెంగుళూరు చుట్టే తిరుగుతుందనే బలమైన నమ్మకం వీళ్ళకి. అమెరికన్ యాక్సెంట్లో ఇంగ్లీషు మాట్లాడే అబ్బాయిలతో తప్ప బట్లరింగ్లీషుగాళ్ళు వీళ్ళలెక్కలో అసలు మగాళ్ళేకాదు.

సుప్రియది బెంగుళూరు.కానీ తెలుగమ్మాయి అని తరువాత తెలిసింది. అప్పటికీ “మా అమ్మానాన్నా తెలుగు. నేను బెంగుళూరమ్మాయిని” అనే చెప్పింది. అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్ ని అని చెప్పినంత హుందాగా. అదేమిటోగానీ, నేను ‘హైద్రాబాదీని’ అని చెప్పుకుందామనుకున్నా దాంట్లోంచీ కూడా ఏదో ముతకవాసనే వస్తుంది. ఆ గుర్తింపులోంచీ మధ్యతరగతి అస్తిత్వపు అరుపు వినిపిస్తుందేతప్ప అర్బన్ పోష్ నెస్ అస్సలు కనిపించదు.

మా పరిచయంకూడా చాలా విచిత్రంగానే జరిగింది. యూనివర్సిటీలో చేరిన నెలకు మా సీనియర్లు ఫ్రెషర్స్ పార్టీ ఇచ్చారు. ఆ పార్టీలో జూనియర్స్ కూడా ఏదో ఒకటి చెయ్యాలి. పాటలు పాడాలి కొన్ని గేమ్స్ డిజైన్ చెయ్యాలి అని ప్రతిపాదించారు. గ్రూప్ గేమ్స్ డిజైన్ చెయ్యడానికి కొందరు వాలంటీర్ చేసేస్తే, ఇక పాటలుపాడేవాళ్ళెవరనే దగ్గరకొచ్చి చర్చ ఆగింది. ఇబ్బందిగానే నేను పాడగలను అని చెప్పేసాను. సుప్రియకూడా పాడుతుందట. ఇద్దరూ ఒకొక సోలో సాంగ్ ఆ తరువాత కలిపి ఒక డ్యూయెట్ పాడాలని క్లాస్ వాళ్ళు నిర్ణయించేశారు. “హలో హేమంత్. యు సింగ్ టూ?” అంటూ దగ్గరకొచ్చింది. అప్పటివరకూ సుప్రియకు నా పేరు తెలుసనికూడా నాకెప్పుడూ అనిపించలేదు.

మా క్లాస్ లోని ఐదుమంది బెంగుళూర్ అమ్మాయిలదీ ఒక జట్టు. ఎవరితోనూ కలిసేవాళ్ళు కాదు. వాళ్ళ జోకులూ, మాటలూ,నవ్వులూ మనలోకానికి సంబంధించినవిగా అనిపించేవికావు. వేరే అమ్మాయిలతో సంబంధం లేనట్లు ప్రవర్తించేవాళ్ళు. అబ్బాయిల్నైతే అసలు గుర్తించేవాళ్ళే కాదు. వాళ్ళుతప్ప మిగతావాళ్ళెవరూ మనుషులు కారన్నట్లుగా ఉండేది ప్రవర్తన. అందుకే సుప్రియకు నాపేరు తెలుసంటే ఆశ్చర్యం.
“యెస్” అని ముక్తసరిగా సమాధానం చెప్పాను.
“వాటార్యూ ప్లానింగ్ టు సింగ్? ఎనీ తెలుగు సాంగ్!” అంది.
చులకన చేస్తోందేమో అనిపించింది.
“లేదు. నో. అయాం సింగింగ్ ఎ హిందీ సాంగ్” అన్నాను.
“హిందీ ఎందుకు? తెలుగులో చాలా మంచి పాటలున్నాయిగా!”
అప్పుడే సుప్రియ నోటివెంట తెలుగు మాటలు వినడం. “నువ్వు తెలుగా” అన్నాను ఆశ్చర్యంగా.
“కాదు. మా అమ్మానాన్నా తెలుగు. నేను బెంగుళూరమ్మాయిని” అంది. ఆ గొంతులో ఏదో ఆలోచన. తన గుర్తింపుని తనే నిర్దేశించుకునే తపన.
ఒక్క క్షణం ఆలోచించి “తెలుగులో ఏం మంచిపాటలున్నాయ్!” అనగలిగాను.
“కొత్తవి కాదు. పాత పాటలు. ముఖ్యంగా బాలసుబ్రమణ్యం లేతగొంతుతోపాడిన పాటలు ఎన్ని లేవు” అంది.

తరువాత సుప్రియ కొనసాగింపుగా “రాజన్ -నాగేంద్ర సంగీతంలో కన్నడ తెలుగు భాషల్లో వచ్చిన బోలెడన్నిపాటలున్నాయి. అన్నీ నాకిష్టమైన పాటలే” అంటూ నా సమాధానం కోసం ఎదురుచూసింది.
ఒక్కసారిగా షాక్ మీద షాక్. నాలోని తన ఊహాచిత్రం ఛిద్రమైన క్షణం. నా అభిప్రాయాల గోడ నామీదే కూలి నన్ను భూస్థాపితం చేసిన క్షణం. ఐ జస్ట్ హేటెడ్ హర్. నన్ను నా బలహీనతల సాక్షిగా కుదింపజేసిన సుప్రియని జీవితంలో క్షమించలేననుకున్నాను.

“మరి నువ్వుకూడా తెలుగు పాట పాడుతావా?”
“లేదులేదు. తెలుగు మాట్లాడటం వరకే. పాడటం నాకు రాదు. కాబట్టి హిందీ పాడతాను.”
“మరి డ్యూయెట్ ఎలా? హిందీ పాడదామా!” అని అడిగాను. వెంఠనే “సరే” అంది.

క్లాసులైపోయిన తరువాత కలిసేవాళ్ళం.రెండ్రోజులు డ్యూయెట్ ప్రాక్టిస్ చేశాం. చష్మెబద్దూర్ అనే హిందీ సినిమాలోంచీ ‘కహాసే ఆయే బదరా…ఖిల్తా జాయే కజరా..’ అనే సెమీ క్లాసికల్ గీతం. నిజానికి ఏ కాంపిటీషన్లో పాడాల్సిన పాట. సుప్రియ “చాలా మంచిపాట కదా పాడుదాం” అంటే, ఫ్రెషర్స్ పార్టీ కోసం పాడటానికి ఒప్పుకున్నాను. ఎక్కడో ఒక మూల ఈ పాట విని నీరసంగా ఉందని సీనియర్లు వెక్కిరిస్తారని ఒక కోరిక. నేను పొందే అవమానంకన్నా, సుప్రియ ఆ అవమానంలో భాగవుతుందన్న ఆశ గొప్ప స్వాంతన కలిగించింది. దీక్షగా పాట ప్రాక్టిస్ చేశాను.

ఆరోజు సాయంత్రం. సుప్రియ ఉమ్రావ్ జాన్ సినిమాలోంచీ ‘దిల్ చీజ్ క్యాహై ఆప్ మెరే జాన్ లీజియే’ అనే ఘజల్ పాడింది. ఆ తరువాత కాస్సేపటికి ఇద్దరి డ్యూయెట్. చాలా కష్టమైన పాట పాడామని అందరూ అభినందించారు.చివరిగా నా వంతు.

నేను ‘పూజ’ సినిమా నుంచీ రాజన్-నాగేంద్ర స్వరపరిచిన ‘ఎన్నెన్నో జన్మల బంధం నీదీనాదీ’ అనే బాలసుబ్రమణ్యం పాట పాడాను. సుప్రియ కళ్ళలో మెరుపు. ఆ పాటపాడాలని నేనెందుకు నిర్ణయించుకున్నానో నాకు ఖచ్చితంగా తెలీదు. అంతగా ద్వేషించే సుప్రియని ఆకర్షించాలని నాలో అంతర్లీనంగా కోరికుందేమో. బహశా తనపై నా ఆధిపత్యాన్ని తనకిష్టమొచ్చింది చేసి సంపాదించుకోవావన్న కోరికనాలో కలిగిందేమో. ఇద్దరిమధ్యా పరిచయం పెరగడానికి ఆ పాట తోడ్పడింది. మరికొన్ని సాయంత్రాలు మామధ్య రాజన్-నాగేంద్ర రాజ్యమేలారు. బాలసుబ్రమణ్యం గాత్రం నా గొంతులోంచీ వినిపించేది. నా పాట మరుపుకు సుప్రియ కళ్ళలోని మెరుపు ఆరాధన అనిపించిన గర్వక్షణాల్ని, నా పాటకు బదులుగా తను పాడేపాటతో తునాతుకలు చేసేది. ఇక్కడా బదులు తీర్చుకునేది. నేనేదో “ఇచ్చానన్న” సంతృప్తినికూడా కలిగనిచ్చేది కాదు.

సినిమాలలో,షికార్లలో, హోటళ్ళలో తనవంతు ఖర్చు తాను క్రమం తప్పకుండా ఇచ్చేది. ఒకవేళ నేను కావాలని మర్చిపోయినా గుర్తుచేసి మరీ అప్పు తీర్చేది. ప్రేమించే మగాడిగా, సాధికారంగా సుప్రియ కోసం నేను చేయాలనుకున్న ఏ పనులూ తను చెయ్యనిచ్చేది కాదు. “కలిసి తిరుగుతున్నాం. కాబట్టి, కలసి చేసే ఖర్చు పంచుకుని చెయ్యాలి” అని నా విలువని శంకిస్తూ మాట్లాడేది.తనని “ఆదుకునే” అధికారం నాకు ఏమాత్రం లేదని ఎప్పుడూ గుర్తుచేసేది. నా చెయ్యి తన శరీరాన్ని తాకినపుడు సహజమైన సిగ్గుతో కుంచించికుపోకుండా, దయతో ప్రేమతో కోరికతో సహకరించేది. అనుభవాన్ని అధికారంతో పంచుకునేది. “ఇలాకాదు ఇలా” అని మార్గనిర్దేశన చేసి నన్నొక వస్తువులాగా, కీ ఇస్తే ఆడే బొమ్మలాగా వాడుకునేది. ఎన్ని అవమానాలు. ఎన్ని ఆక్షేపణలు. ఇలా నా అహాన్నీ,వ్యక్తిత్వాన్ని ఫణంగాపెట్టి సుప్రియ వ్యక్తిత్వాన్ని భరించాల్సి వచ్చేది.

ఏదోఒక స్థాయలో మనల్నిమనం మోసం చేసుకుంటేగానీ జీవితంలో ప్రేమించలేమేమో. “ఐ లైక్ యువర్ సింప్లిసిటీ అండ్ డౌన్ టూ ఎర్చ్ నేచర్” అని సుప్రియ అన్నప్పుడల్లా, నిజంగా నేనూ తనని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానేమో అనే అపోహ కలగేది. సుప్రియ నన్నంతగా అభిమానించడానికి నాలోని గుణాల్ని ఎంచిచూపించేదేకానీ తనకున్న కారణాలు చెప్పేది కాదు.సాధికారంగా జీవితాన్ని పంచుకునేదేగానీ, ఆధారపడుతూ నా ప్రాముఖ్యతను పెంచేది కాదు. నన్ను తన జీవితంలో ఒక ముఖ్యమైనవాడిగా చేస్తూ నన్నొక బానిసని చేసింది. తన జీవితంలో నన్నొక సమానమైన భాగం చేసి నా అహాన్ని కాలరాసింది.

ఇలా ఒక సంవత్సరం నన్ను నేను చంపుకుంటూ తన నిర్వచనాల్లో ఒంపుకుంటూ గడిచింది. వేసవి శెలవులకి సుప్రియ వారం రోజుల ముందే బయల్దేరింది. సుప్రియ వెళ్ళిన మరుసటి రోజు ఒక దారుణమైన వార్త తెలిసింది. సుప్రియ వెళ్ళే బస్సుకి కర్నూలు -అనంతపూర్ల మధ్యన యాక్సిడెంట్ అయ్యింది. విండో సీట్లోకూర్చున్న సుప్రియ కుడిచెయ్యి మోచేతివరకూ తెగిపోయింది. ఆపరేషన్ కోసం బెంగుళూరు చేరేసరికీ తెగిన చెయ్యిని ఐస్ బాక్సులో పెట్టి జాగ్రత చెయ్యకపోవడంతో సర్జరీ చేసి అతికించేందుకు వీలులేకుండా పోయింది. నా గుండె ఆగినంత పనయ్యింది. హుటాహుటిన బెంగుళూరు బయల్దేరాను.ఈ క్షణం లో నా స్నేహితురాలిపై సానుభూతి తప్ప వేరే ఏ భావమూ కలగలేదు. ఐతే ఒక పక్కన ఆమెని నేను నిజం గా ప్రేమిస్తున్నానేమో.

ప్రయాణంలో ఎన్నో ఆలోచనలు. హఠాత్తుగా అనిపించింది ‘ఇప్పుడు తను ఆధారపడటం నేర్చుకునే సమయం వచ్చిందికదా!’ అని. నావ్యక్తిత్వాన్ని తిరిగి దక్కించుకునే అవకాశం నాకు దక్కుతుందేమో. నా మగతనాన్ని తిరిగి సంపాదించుకునే ఛాన్స్ దొరుకుతుందేమో. గర్వంగా తనని ఈ కష్టం నుంచీ ఆదుకునే అదను లభిస్తుందేమో. ఎక్కడో ఆశ. మై పాస్ట్ గ్లోరీ విల్ రెటర్న్.

బాధలో,ఆలోచనల్లో,ఆశల్లో తేలుతూ హాస్పిటల్ చేరాను. సుప్రియ రూము బయటే తన తల్లిదండ్రుల్ని డాక్టర్ తో మాట్లాడుతుండగా కలిశాను. డాక్టర్ అంటున్నాడు “వాటే బ్రేవ్ గర్ల్ షి ఈజ్. స్పృహలోకొచ్చిన మరుక్షణమే, తన పరిస్థితి తెలిసి ఏడ్చి బాధపడకుండా, పక్కనే ఉన్న పెన్నూ, డైరీ తీసుకుని నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ పేరేమిటి అని తెలుసుకుని ఏడమచేత్తో రాయడం మొదలెట్టింది. యు షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ హర్”.

ఆమె పట్ల నాకేదైనా సాఫ్ట్ కార్నర్ /ప్రేమ అనే భావన ఉంటే ఆ క్షణమే పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది.తన కష్టాలకీ, నా కష్టాలకీ తనే నా గుండె పై వాలి “హేమూ, నువ్వు లేకపోతే నేనేమైపోయే దాన్ని” అని భరింపరాని కృతజ్నత తో నా పురుషత్వాన్ని కన్నీటితో ముంచేసే స్త్రీత్వం లేని సుప్రియ ని ఏ మగవాడైనా ఎలా ప్రేమించగలడో నాకర్ధం కాలేదు.

వెనక్కొచ్చేశాను. సుప్రియని కనీసం కలవకుండా వెనక్కొచ్చేశాను. సుప్రియ తల్లిదండ్రులు ఆగమని చెబుతున్నా వినకుండా వెనక్కొచ్చేశాను. సుప్రియను ఎప్పుడు కలుస్తానో, అసలు కలుస్తానో లేదో తెలీదు. కానీ ఒక లేఖ మాత్రం రాశాను. ఎప్పుడో ఒకప్పుడు తనకు ఇవ్వడానికి.

“సుప్రియా, నువ్వు దేవతవి. నువ్వు గొప్పదానివని నేను నిన్ను ‘దేవత’ అని పిలవటం లేదు. నువ్వు నాకూ, ఈ ప్రపంచానికీ పనికిరానిదానివి కాబట్టి దేవతగా భావిస్తున్నాను. పరిపూర్ణ వ్యక్తిత్వం కలిగిన మనుషులు మసలే సమానత్వమనే ఒక ఊహాలోకపు జీవివి నువ్వు. అందుకే నీకు ఈ లోకంలో అందరు మనుషుల్లా బ్రతికే హక్కులేదు. నీ ఉనికిని, వ్యక్తిత్వాన్నీ నేనూ,ఈ ప్రపంచం భరించలేము. అందుకే నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను.”
ఇట్లు
హేమంత్
*****
(ఇది కథో కాదో నాకు తెలీదు. అసలు కథంటే ఏమిటో తెలీకుండా పోయింది.
ఎందుకలా అంటున్నానో ‘కథవెనుక కథ’ లో చెబుతాను)

June 9, 2009

ఆక్రందన

Filed under: కవిత — kathimaheshkumar @ 4:42 pm


ప్రతి కదలికా చర్యకో రూపమే
ప్రతి క్షణం సమయంలో బంధమే
ప్రతి స్థలం విశ్వంలో భాగమే
ప్రతి వ్యక్తీ అనంతంలో ఏకమే

ఏ భావమూ భావనతో విడిపోలేదు
ఏ సంఘటననూ ఘటనతో విడదీయలేము
ఏ చేతననూ చైతన్యంతో విడదీసి చూడలేము
ఏ ఆలోచనానూ స్పృహ నుంచీ విడగొట్టలేము

అందుకే…
“నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అంటే
‘నా’నుంచీ నన్ను కాపాడి
నీలో కలుపుకోమనే ఆక్రందనేతప్ప
స్వార్థమెలా అవుతుంది?

*****

పదికోట్ల మందిలో పదివేల పాఠకులు దొరక్కపోవడం ఎవరి తప్పు?

Filed under: సమాజం, సాహిత్యం — kathimaheshkumar @ 10:57 am

అమెరికా నుంచీ వెలువడే ఒక తెలుగు పత్రిక (తెలుగునాడి) మూతపడిందని కాశ్యప్ తన బ్లాగులో ‘అక్షరం తలదించుకుంది’ అని శీర్షికపెట్టి బ్రహ్మానందం గారు రాసిన ఒక హృద్యమైన వ్యాసాన్ని ప్రచురించారు. బ్రహ్మానందం గారు ఆ పత్రిక గుణగణాల్ని వివరించి, కొన్ని కన్నీళ్ళు కార్చి, ఆ చచ్చిన పత్రికని బ్రతికించడాని ఎవరైనా ఆక్సిజన్ ఇస్తే తనవంతు సిలిండర్ సహాయం చేస్తానని ఆ వ్యాసంలో ప్రతిజ్ఞ చేశారు.

ఆ వ్యాసం చదివి నాకూ బాధకలిగింది. ముఖ్యంగా “అమెరికా నుండి వెలువడే రీడర్స్ డైజస్ట్ నమూనాలో ఆంధ్రదేశంలో వచ్చే వివిధ పత్రికల్లో వచ్చిన మంచి వ్యాసాలూ, కథలూ ఏర్చి కూర్చి వేయడమూ, తెలుగు డయాస్పోరా కథలూ, వ్యాసాలూ ప్రచురించడమూ ఈ తెలుగునాడి చేస్తోంది. అన్ని వర్గాల పాఠకుల్నీ అలరిస్తూ పాత కొత్త సాహిత్యాల్ని పరిచయం చేస్తోంది. ముఖ్యంగా తెలుగు సినిమా వ్యాసాలు చక్కగా ఉంటాయి. సినిమా సమీక్షలు బావుంటాయి. బాల సాహిత్యమంటూ రెండు మూడు పేజీలుంటాయి. అన్నిటికన్నా ముఖ్యం పత్రికకి వాడే పేపరు అత్యంత నాణ్యమైనది. ఇలా ఎంతో వైవిధ్యంగా ఒక తెలుగు పత్రిక ప్రచురింపబడ్డం చూసి ప్రతీ తెలుగువాడూ గర్వ పడాలి.” అంటూ వర్ణించిన ఆ పత్రిక గుణగణాల్ని చదివి మరీ బాధపడ్డాను. ఒక్క డయాస్పొరా కథల్ని మినహాయిస్తే సాక్షి దినపత్రిక ‘ఫ్యామిలీ’ సెక్షన్లో నాకు ఈ పత్రికలోని గుణగణాలన్నీ ప్రతిరోజూ కనిపించడమే నా బలవంతమైన బాధకు కారణం.

చాలా నికృష్టమైన పోలికలాగా, నా టేస్ట్ పరమ చీప్ గా కనిపిస్తే నేనేమీ చెయ్యలేను. నామట్టుకునాకు ఆ గుణగణాల వర్ణన అచ్చుగుద్దినట్లు చౌకబారు ‘స్వాతి’తో సహా అన్ని పత్రికలకూ వర్తింపజెయ్యొచ్చేమోనన్న హడలుపుట్టింది. ఏడాదికి 24 డాలర్లు వెచ్చించి ఈ పత్రిక కొనడానికి కనీసం పదివేల మంది పాఠకులు లేక పత్రిక మూతపడాల్సివచ్చిందనేది ఒక సత్యం. అంటే పదికోట్లున్న తెలుగు జనాల్లో పత్రిక చదవడానికి నెలకు వందరూపాయలు ఖర్చుపెట్టే (సాహితీ) పోషకులు ఎవరూ లేరన్నమాట. చాలా విచారించదగ్గ విషయమే. కాకపోతే, “ఉటంకించిన గుణగణాలన్నీ అత్తెసరు ఆర్రూపాయల పత్రికల్లో దొరుకుతున్నప్పుడు, వందెందుకు పెట్టాలి?” అనేది నాలాంటి తలతిక్క పాఠకుడి ప్రశ్న.

నేను ఈ పత్రిక జీవితంలో ఒకసారికూడా చూడలేదు. చదవలేదు. కాబట్టి దాని గొప్పతనం నాకు తెలీదు. కానీ వింటుంటే మాత్రం ఏమీ గొప్పగా అనిపించడం లేదు. ఒక ముఖ్యమైన ప్రశ్నమాత్రం ఉదయిస్తోంది…..

పదికోట్ల మంది తెలుగోళ్ళలో పదివేల మంది పాఠకులు దొరక్కపోవడం ఎవరి తప్పు?

****

June 8, 2009

పెళ్ళెందుకు?

Filed under: సమాజం, సినిమాలు — kathimaheshkumar @ 1:52 pm

పెళ్ళెందుకు అని చుట్టుపక్కలున్న పదిమందిని అడిగితే పది సమాధానాలొస్తాయి. తాపీధర్మారావు గారు ‘పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాలు’ లో చెప్పినట్లు “చేతులారా మెడకు ఒక బండ కట్టుకోవడమే పెళ్ళి అంటాడు ఒకడు. కామభోగాలకు – ఇతరులకు ఎలాంటి హక్కులూ లేకుండా గుత్త తీసుకోవడమే అంటుంది ఒకర్తె. ఇష్టం ఉన్నా లేకపోయినా ఇల్లు గడుపుకోవడం అంటుంది ఒకర్తె. పగలంతా పరమ చాకిరీ,రాత్రంతా రాద్ధాంతం రణరణలు పెళ్ళి అంటాడు ఒకడు. ఇంటిపేరు నిలబెట్టుకోవడానికి ఇదొక సాధనం అంటాడొకడు. స్వర్గారోహణకు పెళ్ళి ఒక నిచ్చెన అంటాడొకడు. సాంప్రదాయం అంటుందొకర్తె. అదొక సందడి అంటుందొకర్తి…”

తాపీవారు వందసంవత్సరాల ముందు ఇలా చెప్పినా, ఇప్పుడు మరొకరు ఎవరైనా చెప్పినా, పెళ్ళి గురించ వేనోళ్ళ వేయి ఆభిప్రాయాలూ, పెళ్ళి చేసుకోవడానికి భిన్నమైన ఆశయాలూ, పెళ్ళంటే విపరీతమైన ఆలోచనలు.

యండమూరి ఏదో నవల్లో చెప్పినట్లు “మగాడు సెక్స్ కోసం పెళ్ళిని అంగీకరిస్తే ఆడది సేఫ్టీ కోసం పెళ్ళిని ఒప్పుకొంటుంది” అనేది మరో ఆధునిక భాష్యం. మొత్తాని పెళ్ళి ఇలా అవసరాలు, అభిప్రాయాలూ, కోరికలూ, ఆశల మధ్య నిర్వచనాల్ని వెతుక్కుంటూ కాలం గడిపేస్తోంది. లోకభిన్న రుచి: అన్నట్టు ప్రతివాడికీ, ప్రతొకత్తెకీ పెళ్ళికి కావలసిన కారణాలు విభిన్నం. కానీ పెళిమాత్రం ఒక అత్యవసరం. తధ్యం. ఎంతైనా రంగీలా సినిమాలో అమీర్ ఖాన్ అన్నట్లు “లైఫ్ లో సెటిలవ్వాలికదా! “

ఇక్కడ విషయం పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరం అయితే పెద్దాయన తాపీధర్మారావు గారు ఆంత్రాపొలాజికల్ సాక్షాలతో సహా ఎప్పుడో తేల్చేశారు కాబట్టి నేను కొత్తగా చెప్పేది ఏమీ ఉండదు. పెళ్ళి గురించి నా అభిప్రాయం రాయాలంటే అదొక మహాభారతం అవుతుంది. అంటే మొత్తం కథ తరువాత యుద్ధం మాత్రం గ్యారంటీ అన్నమాట. అందుకే ఆ విషయాల ప్రస్తావన దాటేద్ధాం.

మొత్తానికి ఈ పెళ్ళి గోలంతా ఇప్పుడెందుకు చెబుతున్నానంటే, ఈ మధ్య స్టార్ మూవీస్ లో ఒక ఇంగ్లీషు సినిమా చూస్తుంటే అనుకోకుండా ఒక జ్ఞానగుళిక పుటుక్కున తెరచించుకుని నా కళ్ళు తెరిపించింది. ప్రత్యేకంగా చెప్పఖ్ఖర లేదనుకుంటాను. ఆ జ్ఞాన గుళిక పెళ్ళనే మహత్తర కార్యం గురించే. ‘పెళ్ళెందుకు’ అని ఇప్పుడున్న పెళ్ళికాని యువతని అడిగితే తోడుకోసం, భాగస్వామి కోసం, ఆత్మబంధువు కోసం, ప్రేమ కోసం, అనుబంధం కోసం, ఆత్మీయత కోసం, ఆధారంకోసం అని ఎన్ని కథలైనా చెబుతారు. అవి నిజం కూడా కావచ్చుగాక, కానీ ఈ సినిమాలో చెప్పే కారణం వింటే కూసింత మతిపోయి “అబ్బా. నిజమే!” అనిపించే జ్ఞానోదయం ఖచ్చితంగా అవుతుంది.

Why people get married.

“We need a witness to our lives. There’s a billion people on the planet … I mean, what does any one life really mean? But in a marriage, you’re promising to care about everything. The good things, the bad things, the terrible things, the mundane things … all of it, all of the time, every day. You’re saying ‘Your life will not go unnoticed because I will notice it. Your life will not go un-witnessed because I will be your witness’.”

– Beverly Clark (Played by Susan Sarandon)

క్లార్క్ పాత్ర అంటుంది… “మనుషులు పెళ్ళి చేసుకోవడానికి కారణం జీవితాలకు ఒక సాక్ష్యం కావాలనుకోవడం. కొన్ని వేలకొట్ల మందుండే ఈ లోకంలో నిజంగా ఒక చిరుజీవితానికి అర్థం ఉందా? కానీ పెళ్ళిలో ఉంటుంది. ప్రతొక్క విషయానికీ ఒక గుర్తింపు ఉంటుంది. మంచైనా,చెడైనా, ఛడాలమైనదైనా, రోజువారీ బోరుకొట్టే విషయమైనా… ప్రతి క్షణం, ప్రతిరోజూ మన జీవితాన్ని తరచిచూడటానికి ఒక సాక్షి ఉంటుంది/ఉంటాడు. ప్రతి విషయం గుర్తింపబడుతుంది. జీవితం ఎవరూ గమనించకుండా ముగిసిపోదు. పెళ్ళిద్వారా మన జీవితానికి ఒక సాక్ష్యమివ్వడానికి సాక్షి లభిస్తుంది.”

పెళ్ళిద్వారా మన జీవితాన్ని గుర్తించే సాక్షం లభిస్తుంది అనేది ఎందుకో ఒక మహత్తరమైన కారణం అనిపించింది. ఏమో అందరికీ ఆ కారణం కావాలేమో ! అందుకే పెళ్ళికి ఇంత మహత్వం ఉందేమో!

*****

వ్యభిచారం : చట్టవ్యతిరేకం Vs అనైతికం

Filed under: సమాజం — kathimaheshkumar @ 8:03 am

కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రకారం మన దేశంలో 2.8 మిలియన్ సెక్స్ వర్కర్లు ఉన్నారు. వీరిలో దాదాపు 36% ఈ వృత్తిలోకి పద్దెనిమిది సంవత్సరాలు నిండకముందే ప్రవేశించారు (బహుశా బలవంతంగా ప్రవేశపెట్టబడ్డారు). కొన్ని స్వచ్చంధ సంస్థల లెక్కల ప్రకారం సెక్స్ వర్కర్ల సంఖ్య 15 మిలియన్లు. ఒక ముంబై నగరంలోనే లక్షమంది వరకూ సెక్స్ వర్కర్లు ఉన్నారని ఒక అంచనా.

1956 ఏర్పడిన The Immoral Traffic (Suppression) Act (SITA) చట్టం వ్యభిచారాన్ని చట్ట విరుద్ధం చేయకపోయినా, పబ్లిక్ స్థలాల్లో విటుల్ని ఆకర్షించకూడదనే క్లాజ్ ఆధారంగా పోలీసులు సెక్స్ వర్కర్లను వేధించడానికి ఉపయోగించుకుంటూ పరిస్థితుల్ని అత్యంత దయనీయమైన స్థితికి తీసుకువచ్చారు. చిత్రంగా ఈ చట్టంయొక్క ఉపనామం “సీత”. పోలీసులు పబ్లిక్ ఇండీసెన్సీ, పబ్లిక్ న్యూసెన్స్ లాంటి అర్థంకాని, చట్టప్రకారం నిర్వచింపలేని పదాల్ని ఉపయోగించి సెక్స్ వర్కర్లపై కేసులు బనాయించిన ఘటనలు కోకొల్లలు. ఈ నేపధ్యంలో చట్టాన్ని రక్షించేవారి చేతులనుంచీ రక్షణకల్పించమని సెక్స్ వర్కర్లు ఉద్యమాలు చేశారు. ఇక భారతదేశంలో పిల్లల్ని పడుపు వృత్తిలోకి దించే సమస్య అత్యంత విస్తృతం,అమానుషం. మన దేశంలోని 378 జిల్లాలలో మానవ ట్రాఫికింగ్, ముఖ్యంగా పిల్లల ట్రాఫికింగ్ ఏదో ఒక స్థాయిలో జరుగుతోందనే నిజం ఈ సమస్య విస్తృతత్వానికి నిదర్శనం.

ఈ పరిస్థితుల్లో HIV/AIDS వ్యాప్తి ప్రపంచం మొత్తాన్ని వణికించినట్లే భారతదేశాన్నీ పట్టిపీడిస్తోంది. ఈ వ్యాధి వ్యాప్తిలో సెక్స్ వర్కర్ల పాత్రను గుర్తించి Targeted Interventions (TIs) పేరుతో చాలా కార్యక్రమాల రూపకల్పన చెయ్యడం జరిగింది. వ్యాధి వ్యాప్తిలో వీరి పాత్రను వ్యాధి నిరోధక దిశగా మళ్ళించకపోతే అత్యంత ప్రమాదకారిగా మారుతుందన్న నిజాన్ని గ్రహించిన ప్రభుత్వం, సెక్స్ వర్కర్ల సమూహాలను సంఘటిత పరిచి లైంగిక విద్యద్వారా HIV/AIDS వ్యాప్తిని నిరోధించే కార్యక్రమాలను చేపట్టింది.

ఈ నేపధ్యంలో “మానవహక్కుల” ఆధారంగా ఉద్భవించిన డిమాండ్, ‘సెక్స్ వర్కర్ల హక్కుల రక్షణ’. ఈ ప్రతిపాదనను చాలా మంది వ్యభిచారానికి చట్టబద్ధత కల్పించడంగా అర్థం చేసుకోవడం అవగాహనాలేమి తప్ప మరొటి కాదు. భారతదేశంలో పడుపువృత్తి చట్టవ్యతిరేకం ఎప్పుడూ కాదు. Law actually “does not criminalise prostitution or prostitutes per se, but mostly punishes acts by third parties facilitating prostitution like brothel keeping, living off earnings and procuring, even where sex work is not coerced”. అంటే, ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నం ఉన్న చట్టాన్ని మరింత మానవీయం చెయ్యడానికి జరిగే యత్నమే తప్ప మరొటి కాదు. “Denial of equality of the rights and opportunities and of dignity and of the rights of equal protection against any discrimination of fallen women is violation of Universal Declaration under Article 7 and as well as Article 14 of Indian constitution” ఆధారంగా జరగనున్న ఒక corrective measure మాత్రమే. ఈ చట్టంలో ఉండబోయే మార్పల్లా “The emphasis IS NOT on the sex worker but the clients/pimps/brothel owners etc”. అంత మాత్రానికే ఇన్ని వాదప్రతివాదనలు తయారవడం చూస్తుంటే కొంత అశ్చర్యం మరికొంత బాధా కలుగుతోంది.

ఈ కొత్తచట్టం వలన వ్యభిచారం మరింత మెరుగ్గా రెగ్యులరైజ్ చెయ్యబడుతుంది. తద్వారా వ్యభిచారంలోకి బలవంతంగా నెట్టబడుతున్న వారి సంఖ్యతగ్గి హ్యూమన్ ట్రాఫికింగ్ వలయాలు చేధింపబడతాయి. ముఖ్యంగా పిల్లలు వ్యభిచార వృత్తిలోకి రాకుండా కాపాడగలుగుతాము. సెక్స్ వర్కర్ల అమానుష జీవితాలు ఉద్ధరింపబడతాయి. ప్రత్యామ్న్యాయ జోవనోపాధుల సృష్టిద్వారా గౌరవప్రదమైన జీవితాల్ని జీవించడానికి బయటికొచ్చేవారి సంఖ్య పెరుగుతుంది. HIV/AIDS వ్యాప్తిని నిరోధించే అవకాశాలు మెరుగుపడి ప్రజారోగ్యంపై అనుకూల ప్రభావం పడుతుంది.

వ్యభిచారాన్ని హఠాత్తుగా (సమూలంగా) రూపుమాపాలనుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ఆచరణయోగ్యంకాని ఆదర్శం. ప్రపంచంలో ఏ దేశమూ వ్యభిచారాన్ని సమూలంగా రూపుమాపిన దాఖలాలు అసలు లేవు. అయినా సరే, ఈ మహత్తర ఆదర్శాన్ని పూరించాలంటే మొదటగా ప్రస్తుతం ఉన్న సమస్యలకు సమాధానాలు వెతకాలి. ఆ దిశగా ప్రతిపాదిత చట్టం ఒక ముందడుగు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా, చట్టపరమైన, మానవహక్కుల పరమైన కోణాల్ని విస్మరించి కేవలం “నైతికత” కోణంలోంచీ ఈ సమస్యను చూడటం అర్థరహితం. పైగా ఈ “చట్టబద్ధత” కుటుంబ విలువలకు గొడ్డలిపెట్టుగా వర్ణించబూనటం అసమంజసం.

ఈ మొత్తం వ్యాసంలోకూడా మేల్ ప్రాస్టిట్యూషన్ – మగ పడుపువృత్తిని గురించి ప్రస్తావించకపోవడం మన భారతీయ పురుషాహంకార సెక్సిస్ట్ నేచర్ కి ఉదాహరణేమో!

*****

June 5, 2009

కమలా దాస్ జ్ఞాపకార్థం

Filed under: కవిత, సాహిత్యం — kathimaheshkumar @ 11:10 am

31 March 1934 – 31 May 2009

When I die
Do not throw the meat and bones away
But pile them up
And let them tell
By their smell
What life was worth
On this earth
What love was worth
In the end.

నా మరణానంతరం
మాంసాన్నీ ఎముకల్నీ పారెయ్యకండి
భద్రంగా ఒక చోట కుప్ప పొయ్యండి
ఈ భూమ్మీద జీవితం విలువేమిటో
చివరకు ప్రేమకున్న విలువేమిటో
అవి అప్పుడు చెబుతాయి

– కమలా దాస్

*****


మీరు దేవుడ్ని నమ్ముతారా?

Filed under: మతం, సినిమాలు — kathimaheshkumar @ 7:57 am


ఇప్పుడే ‘డావిన్సీ కోడ్’ రచయిత డాన్ బ్రౌన్ రాసిన మరో నవల ‘ఏంజిల్స్ అన్డ్ డెమొన్స్’ సినిమా రూపకం చూసొస్తున్నాను. గొప్ప సినిమా కాదుగానీ నిర్మాణ విలువలు, నటన, లొకేషన్ల పరంగా విజువల్ ట్రీట్ అనుకోవచ్చు. కథాంశం ఎలాగూ ధిల్లర్ కాబట్టి వేగం, మలుపులతో ఆసక్తికరంగా సాగే ఒక కమర్షియల్ సినిమాగా బాగానే ఉంది. ఖచ్చితంగా ఒకసారి చూసెయ్యొచ్చు. మతానికి సంబంధించిన కుట్రలూ, క్రైస్తవ మతం సాగించిన హత్యలూ, సైన్సు తో క్రైస్తవం యొక్క చారిత్రాత్మక విభేధాలూ వంటి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ సినిమాలో ఆద్యంతం మనల్ని ఆకట్టుకుంటాయి. వాటికన్ సిటీ అందాలు. బృహత్తరమైన, మహత్తరమైన కట్టడాలు వాటి చరిత్రా చూపించిన విధానం దృశ్యపరంగానూ డావిన్సీ కోడ్ సినిమా కంటే మెరుగ్గా అనిపిస్తాయి.

ఈ టపా ఈ సినిమాను సమీక్షించడానికి కాదు. కాకపోతే నేను చెప్పబోయే విషయానికి భూమికగా పై సోది చెప్పాల్సి వచ్చింది. ఈ సినిమాలో ముఖ్యపాత్రధారి డాక్టర్ ప్రొఫెసర్ రాబర్ట్ లాంగ్డన్ సింబాలజిస్ట్, ఒక హేతువాది. అప్పటికే చర్చ్ కి వ్యతిరేకంగా పుస్తకాలు రాసిన వ్యక్తి. అటువంటి రాబర్ట్ ను ఒక పాత్ర “నువ్వు దేవుడ్ని నమ్ముతావా?” అని ప్రశ్నిస్తుంది. సహజంగా అయితే “నమ్మను” అనే సాధారణమైన సమాధానం సరిపోతుంది. కానీ అక్కడ జరిగే సంవాదం మతం పట్ల ఒక ఆసక్తికరమైన చర్చగా మారుతుంది. ఆ సంబాషణల్ని తెలుగు అనువాదంతో సహా ఇక్కడ పెడుతున్నాను.

Do you believe in God Mr. Langdon?
మీరు దేవుడ్ని నమ్ముతారా మిస్టర్ లాంగ్డన్?
I want to believe.
నమ్మాలని అనుకుంటాను.
Mr. Langdon, I did not ask if you believe what man says about God. I asked if you believed in God.
మిస్టర్ లాంగ్డన్ నేనడిగింది మీరు దేవుడి గురించి మనుషులు చెబుతున్నవి నమ్ముతారా అని కాదు. దేవుడ్ని నమ్ముతారా అని.
My mind tells me I will never understand God. And my heart tells me I am not meant to.”
నా మెదడు చెబుతోంది నేను దేవుడ్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేనని. నా మనసు నేను దేవుడ్ని అర్థం చేసుకోవడానికి ఉద్దేశింపబడలేదంటోంది.

ఇదొక ఉదాహరణ మాత్రమే. ఈ సినిమాలో ఇలాంటివి మరికొన్ని ఉన్నాయి. వాటి గురించి మరోసారి.

****

June 4, 2009

ఐ యామ్ ఎ మ్యాన్ ఆఫ్ కాంట్రడిక్షన్స్

Filed under: కవిత — kathimaheshkumar @ 11:19 am


వైరుధ్యం లేకుండా వైవిధ్యం ఎక్కడుంది?
అసలు జీవితమే ఒక వైరుధ్యమైతే
విలువల వైరుధ్యం ఎక్కడుంది?

ఈ విశ్వం ఒక పెద్ద కాంట్రడిక్షన్
ఒక వైరుధ్యాన్ని సమాధానపరిస్తే
మరో వైరుధ్యాన్ని కొనితెచ్చుకోవటమే ఈ విశ్వరూపం
మరి ఆ వైరుధ్యమే లేకపోతే…

అందుకే…
వైరుధ్యం నా వ్యక్తిత్వం
వైరుధ్యం నా అస్తిత్వం
వైరుధ్యం నా జీవితం
వైరుధ్యం నా విశ్వం
ఐ యామ్ ఎ మ్యాన్ ఆఫ్ కాంట్రడిక్షన్స్

(శేఖర్ కపూర్ బ్లాగు టపా స్ఫూర్తితో)

‘దళిత మహిళ’ అనే క్వాలిఫికేషన్ ఉంటే సరా!

Filed under: సమాజం — kathimaheshkumar @ 6:21 am

మీరాకుమార్ ను స్పీకర్ గా ఎంపిక చేసిన మరుక్షణం, “‘దళిత మహిళ’ అనే క్వాలిఫికేషన్ ఉంటే సరా! సామర్ధ్యం అవసరం లేదా?” అనే ప్రశ్నలు మీడియాలో వినబడుతున్నాయి. ఇక్కడా మెరిట్ వర్సెస్ కోటా వాదనలు అర్జంటుగా ఊపందుకున్నాయి. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ “ఒక మహిళ, ఒక దళితమహిళ, దళితనేత జగజీవన్ రాం పుత్రిక లోక్ సభకు స్పీకర్ అవ్వడం” చారిత్రాత్మకం అని మీరాకుమార్ ను గురించి చెప్పడాన్ని సాకుగా తీసుకుని రంగులు పులిమి తిమ్మినిబమ్మిని చెయ్యడానికి చాలా ప్రయత్నాలు మొదలయ్యాయి.

ఒక మాజీ ఐ.ఎఫ్.ఎస్ అధికారిణి. ఐదుసార్లు విజయవంతంగా లోక్ సభకు ఎన్నికైన రాజకీయ నేత. వివధ పార్లమెంటరీ కమిటీల్లో సభ్యురాలిగా చేసిన అనుభవజ్ఞురాలు. కేంద్ర క్యాబినెట్ లో మంత్రిగా చేసిన సామర్ధ్యం మీరాకుమార్ లో ఉండగా, ఇప్పుడు హఠాత్తుగా తన సామర్ధ్యం మీద ప్రశ్నలెందుకు ఉదయిస్తున్నాయో అన్నది చిదంబర రహస్యం. రాజకీయాలకు అతీతంగా ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఢిల్లీ, వివిధ స్వచ్చంధ సేవా కార్యక్రమాలూ/ఉద్యమాలకు అధ్యక్షత వహించిన ఘనతకూడా మీరాకుమార్ కు ఉంది. 1967 లోవచ్చిన ఈ శతాబ్ధపు అత్యంత భయంకరమైన కరువు కాలంలో National Drought Relief Committee కి అధ్యక్షురాలిగా మీరాకుమార్ చేసిన సేవ అత్యంత ముదావహం. దళిత ఉద్యమంలో,మానవహకుల ఉద్యమంలో గత ఇరవై సంవత్సరాలుగా మీరాకుమార్ అందిస్తున్న సేవ అమోఘం. అంతేకాక రైఫిల్ షూటింగ్ లాంటి స్పోర్ట్స్ లో మెడల్స్ సాధించిన క్రీడాకారిణి మీరాకుమార్. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాకూడా తన సామర్ధ్యాన్ని శంకించడం అంతర్లీనంగా మీడియాలో పేరుకుపోయిన లింగ,కుల వివక్షకు సంకేతం కాక మరేమిటి?

భారత రాజకీయాలలో సామాజిక సింబాలిజం కున్న ప్రాముఖ్యత తెలియనిది కాదు. అంత మాత్రానా సామర్ధ్యలేమితో కాంప్రమైజ్ అవుతూ రాజ్యాంగపరమైన బాధ్యతలను అంటగడుతున్నారన్నది అత్యంత అసంబద్ధమైన వాదన. ముఖ్యంగా మీరాకుమార్ విషయంలో ఈ వాదన అత్యంత పేలవం. లోక్ సభ స్పీకర్లను తయారు చెయ్యడానికి ప్రత్యేకమైన స్కూలేదీ లేదు. ఎన్నికైన సభ్యుల నుంచే ఒక ఆమోదయోగ్యమైన సభ్యుడ్ని/సభ్యురాల్ని స్పీకర్ గా ఎన్నిక చేస్తారు. ఇప్పుడూ అదే జరిగింది. మీరా కుమార్ స్పీకర్ సీట్లో కూర్చుని ఒకరోజుకూడా కాలేదు. అప్పుడే “సామర్ధ్యం లేదు” అంటే ఎవరు నిరూపిస్తారు? ఎలా నిర్ధారిస్తారు?

సోమ్ నాధ్ చటర్జీ, బాలయోగి, సాంగ్మా అందరూ స్పీకర్లయ్యాకనే సభాపాలనతో తమ మార్కు ప్రత్యేకతను చాటారు. తమదైన సాంప్రదాయాలను నిలిపారు. ఇప్పటి వరకూ ఒక మహిళ స్పీకర్ అవలేదు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. మీరాకుమార్ ఒక కొత్త ఒరవడిని తీసుకురాదని ఖచ్చితంగా ఎరైనా చెప్పగలరా? మరి ఈ స్పెక్యులేషన్స్ ఎందుకు? ఎందుకంటే ఒక మహిళ, ఒక దళిత మహిళ సామర్ధ్యం మీద ప్రశ్నలు రేపడం చాలా సులభం గనక. అలా చేస్తే ఒక తరగతి ప్రజలు సంతోషిస్తారు గనక. ఇందులో వివక్ష లేదు అంటే నమ్మేదెలా?

ఒకానొక ఛానెల్లో అయితే మరో మెట్టు దిగి మీరాకుమార్ సన్నని పీల గొంతు పెద్ద డిస్క్వాలిఫికేషన్ అన్నట్లుగా పదినిమిషాల కథనాన్ని వినిపించేశారు. లోక్ సభను అదుపులో పెట్టడానికి కంచుకఠం కావాలనీ, అది లేదు కాబట్టి మీరాకుమార్ తగదనీ తేల్చేశారు. బహుశా వీళ్ళకు స్పీకర్ బాధ్యతల గురించి కనీస పరిజ్ఞానం కూడా ఉన్నట్లు లేదు. మనం ‘లోక్ సభ టివి’లో చూసే ప్రొసీడింగ్స్ మాత్రమే స్పీకర్ పని కాదు. అంతకు మించిన రాజ్యాంగ బాధ్యతలు స్పీకర్ కున్నాయన్న ఎరుక కూడా లేకుండా మీరాకుమార్ సామర్ధ్యాన్ని శంకిస్తున్న ధోరణిని ఏమనాలి?

మహిళా రాష్ట్రపతి, మహిళా స్పీకర్, మహిళా యూపీఏ చైర్ పర్సన్, మహిళా ప్రతిపక్ష నేత (లోక్ సభ లో సుష్మాస్వరాజ్) ఉండగా మహిళా రిజర్వేషన్ బిల్ ఇప్పటికైనా పాస్ అవుతుందా అనే ఉపయోగకరమైన చర్చలు వదిలేసి ఇలాంటి వివక్షాపూర్వకమైన చర్చలతో మీడియా కాలయాపన చెయ్యటం కొత్త కాకపోయినా, (మరొక్కసారి) నిరాశాజనకం అనిమాత్రం చెప్పొచ్చు.

*****
« Newer PostsOlder Posts »

Theme: Banana Smoothie. Blog at WordPress.com.

Follow

Get every new post delivered to your Inbox.